
సమ్మెతో సింగరేణికి నష్టం
● సంస్థకు రూ.30 కోట్లు, కార్మికులకు రూ.13 కోట్ల నష్టం ● సంస్థవ్యాప్తంగా హాజరు 15 శాతమే ● కార్మిక సంఘాల్లో నూతనోత్సాహం
గోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా సింగరేణిలో ఒక్కరోజు టోకెన్ సమ్మె ఈనెల 9న విజయవంతమైంది. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బీజేపీ అనుబంధ బీఎంఎస్ మాత్రం దూరంగా ఉంది. సమ్మె విజయవంతానికి అన్ని కార్మిక సంఘాలు గనులపై విస్తృత ప్రచారం చేశాయి. కార్మికులకు సంబంధించి ప్రధాన డిమాండ్ లేబర్‌కోడ్ కూడా పొందుపర్చడంతో సమ్మె పిలుపునకు మంచి స్పందన లభించింది. సింగరేణి కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనగా విజయవంతమైంది. ఈ క్రమంలో ఒక్కరోజు టోకెన్ సమ్మె సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది. సంస్థవ్యాప్తంగా ఒక్కరోజు 1.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 80వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.30కోట్ల నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అలాగే సంస్థవ్యాప్తంగా 40వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, 6వేల మంది అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు. సంస్థ వ్యాప్తంగా 25వేల మంది కాంట్రాక్టు కార్మికులకు సమ్మెలో పాల్గొన్నారు.
మూడు ఏరియాల్లో ఉత్పత్తి నిల్
సమ్మె ప్రభావం సంస్థపై చూపింది. 11 ఏరియాల కు గాను 8 ఏరియాల్లో 46 శాతం మేర బొగ్గు ఉత్పత్తి కాగా, మందమర్రి, బెల్లంపల్లి, ఏపీఏ ఏరియాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మిగతా ఏరియాలోని గనులు కొద్దిమేర ఉత్పత్తి సాధించాయి.
రూ.30 కోట్ల నష్టం
సింగరేణిలో సమ్మె మూలంగా సుమారు రూ. 30కోట్ల మేర ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అలాగే కార్మికులు వేతనాల రూపంలో రూ.13 కోట్ల మేర నష్టపోయారు. సమ్మెతో కార్మికులు, యాజమాన్యం ఇద్దరు నష్టపోయినా కార్మికులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలపై కేంద్రం దిగివచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
సంఘాల్లో నూతనోత్సాహం
సంస్థ వ్యాప్తంగా చేపట్టిన ఒక్కరోజు సమ్మె సక్సెస్ కావడంతో కార్మిక సంఘాల నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. సంస్థలో గుర్తింపు యూనియన్‌గా గెలుపొందిన ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్‌టీయూసీ, గతంలో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు సీఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్‌టీయూసీ, ఏఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లు, కాంట్రాక్టు కార్మికుల్లో విస్తృత ప్రచారం చేయడంతో కార్మికులు సమ్మెకు మొగ్గు చూపారు. సమ్మె విజయవంతంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయకుండా దేశవ్యాప్త నిరవధిక సమ్మైకె నా వెనకాడబోమని చెబుతున్నాయి.
సంస్థలో 09–07–25 రోజు టార్గెట్.. (వేల టన్నుల్లో..)
ఏరియా టార్గెట్ సాధించింది
కొత్తగూడెం 36,793 20,033
ఇల్లెందు 8,192 3,009
మణుగూరు 28,093 16,525
బెల్లంపల్లి 7,407 -
మందమర్రి 7,519 -
శ్రీరాంపూర్ 18,122 2,837
ఆర్జీ–1 11,885 6,740
ఆర్జీ–2 25,204 20,013
ఆర్జీ–3 16,296 5,696
ఏఈఏ 5,011 -
భూపాల్‌పల్లి 10,796 6,091
మొత్తం 1,75,318 80,944