
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్‌లో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమే అన్నారు. పార్టీలకు అతీతంగా ఈనెల 15న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్ప ప్రకాశ్, తమ్మన్నగారి సంగన్నచ సిద్దగోని శ్రీనివాస్, వల్లూరి వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.