
ఠాణా ఎదుట బీఆర్‌ఎస్ ఆందోళన
రామగిరి(మంథని): తమ నాయకుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని గురువారం రాత్రి బీఆర్‌ఎస్ నాయకులు రామగిరి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు.. మండలంలోని నాగెపల్లి గ్రామానికి చెందిన యువకుడికి కనగర్తి గ్రామానికి చెందిన యువతితో నెలరోజుల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు గతంలోనే పెద్దపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ప్రేమజంట పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. తర్వాత యువతిని వారి తల్లిదండ్రులు తీసుకెళ్లగా మళ్లీ తల్లిదండ్రులతో ఉండలేక యువకుడి చెంతకు చేరింది. ఈక్రమంలో యువతి కనిపించడం లేదని పెద్దపల్లి రూరల్ పోలీసుస్టేషన్‌లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత పోలీసులు యువతి వాంగ్మూలం కోసం నాగెపల్లి గ్రామానికి వెళ్లగా యువకుడి తరఫున గ్రామానికి చెందిన కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వాగ్వాదానికి దిగారని అతడిని రామగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, మండల బీఆర్‌ఎస్ నాయకులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఒక దశలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకులకు వాగ్వాదం జరుగగా పోలీసులు లాఠీచార్జి చేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు 3 గంటలపాటు స్టేషన్ ఎదుట హైడ్రామా కొనసాగగా సత్యనారాయణపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.