
గాయపడిన వ్యక్తి మృతి
కొడిమ్యాల: లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో గాయపడిన మండలంలోని సండ్రాలపల్లికి చెందిన బుచ్చిబాబు (28) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథన ప్రకారం.. బుచ్చిబాబు తనకు వరుసకు కొడుకై న మారుతితో కలిసి గంగాధర మండలం వైపు వెళ్తున్నారు. కొడిమ్యాల మండలం తుర్కాషినగర్ వద్దకు వెళ్లగానే కరీంనగర్ రహదారిపై లారీ వీరి బైక్‌ను ఢీకొంది. ఈఘటనలో బుచ్చిబాబు, మారుతి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేదు. చికిత్స పొందుతూ బుచ్చిబాబు మృతి చెందాడు. మారుతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి ..
కరీంనగర్ క్రైం: గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణంగా గత వారం రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా రెండు రోజుల క్రితం మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే టూటౌన్ పోలీసులను ఆశ్రయించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్...
రామగుండం: రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి విలేజ్ రామగుండం రోడ్డుపై రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సంధ్యారాణి తెలిపిన వివరాలు.. విలేజ్ రామగుండంకు చెందిన అంబాల రాజశేఖర్(50) ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు యూనిట్–7లో షిప్ట్ ఆపరేషన్ విభాగంలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బొలెరో ఢీకొని..
ధర్మారం: మండలకేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన మెడవేని చిన్నయ్య (70) మృతిచెందాడు. మండలకేంద్రానికి చెందిన చిన్నయ్య తన టీవీఎస్ వాహనంపై ధర్మారం నుంచి పెట్రోల్ బంకుకు వెళ్తున్నాడు. కరీంనగర్ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన చిన్నయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల అదుపులో లొంగిపోయినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
చల్లూరు గ్రామంలో
ఒకరు..
వీణవంక: మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన కొలిపాక రాజయ్య(60) సోమవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామ శివారులో వాకింగ్ చేస్తుండగా మామిడాలపల్లి నుంచి రాజిరెడ్డి అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ వస్తూ రాజయ్యను వెనక నుంచి ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

గాయపడిన వ్యక్తి మృతి