
లక్ష్మీపూర్‌లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్‌ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్‌తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్‌పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్‌సీజీ ఇంజక్షన్‌లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొడుకు పేరుతో తండ్రి వైద్యం
అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్‌లు ఇస్తున్న వైనం