
ముందస్తు సాగుదాం
● వరి నాట్లలో ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కే అవకాశం ● జూన్ 15లోగా నాట్లు పూర్తిచేసేలా అధికారుల సూచనలు ● రైతులకు అవగాహన కల్పిస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశం
సాక్షి, పెద్దపల్లి: రైతులు ఆరుగాలం కష్టపడి పంట లు పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నా చివరిక్షణంలో అకాలవర్షాలు దెబ్బతీస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను తప్పించలేం కానీ పంట కాలాన్ని ముందుకు జరుపుకోవడం మన చేతిలో పని అని, తద్వారా పంటలను కాపాడుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సీజన్‌ను నెల రోజులు ముందుకు జరిపేలా జిల్లా అధికార యంత్రాంగం రైతులకు అవగహన కల్పిస్తూ చైతన్యం తెస్తోంది. కొన్నేళ్లుగా ఏటా కురుస్తున్న అకాల వర్షాల తీరును పరిశీలిస్తే నవంబర్‌లో వచ్చే తుపాన్లు, ఏప్రిల్‌లో కురిసే అకాల వర్షాలతో చేతికొచ్చే పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు.
రోహిణి కార్తెలో తొలకరి..
ఈఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో రోహిణి కార్తెలోనే తొలకరి పలకరించింది. ముందస్తు సాగుకు సన్నద్ధం చేసేందుకు ఇదేమంచి అవకాశమని, పొలంబాట పట్టాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తూ, విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇలా చేస్తే మేలు..
● వానాకాలం వరి సాగును ముందస్తుగా చేపట్టడం ద్వారా పంటను అక్టోబర్ మూడోవారం నుంచి నవంబర్ మొదటివారం లోపు కోసుకోవచ్చు. యాసంగి వరి నారును నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు సిద్ధం చేసుకుంటే, పంటను మార్చి మూడోవారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కోసుకోవచ్చు.
● 140 రోజులు అంతకన్నా ఎక్కువ దీర్ఘకాలిక పంటలకు మే 25 నుంచి జూన్ 10 మధ్య, 135 రోజుల పంటకాలం కలిగిన మధ్యకాలిక పంట లకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు, 120 రోజుల పంటకాలం కలిగిన పంటలకు జూలై 15 వరకు నార్లు పోసుకుంటే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
● వానాకాలంలో దీర్ఘకాలిక రకాలను సాగు చేయాలనుకునే రైతులు రోహిణి కార్తెలో నారుపోస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని, జూన్ 2వ వారం పూర్తయిన తర్వాత నారుపోస్తే పూత సమయంలో చలితో గొలుసు పూర్తిగా బయటకు రాక గింజ నల్లపడడం, వర్షాలతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు.
ఈవానాకాలంలో సాగు సమాచారం(ఎకరాల్లో)
మొత్తం సాగు 2,76,076
వరి 2,12,500
పత్తి 52,500
మొక్కజొన్న 705
ఉద్యాన 10,086
ఇతర 285
అవసరమైన విత్తనాలు 1,84,457 (క్వింటాళ్లలో)
అవసరమైన ఎరువులు 70,731 (మెట్రిక్ టన్నుల్లో)
అవగాహన కల్పిస్తున్నాం
ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు రైతులు ముందస్తు పంటలను సాగు చేసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వానాకాలం సీజన్‌ను ఒక నెల ముందుకు జరిపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సాగునీరు ఇవ్వడానికి, విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రైతులు వెంటనే వ్యవసాయ పనులను ప్రారంభించుకోవాలి.
– ఆదిరెడ్డి, డీఏవో
ముందస్తు ప్రణాళికతో మేలు
తొలకరిలో దున్నితే నేలలోకి నీరు బాగా ఇంకి బాగా గుల్లబారుతుంది. తర్వాత వేసే పంటలకు ఉపయోగపడుతుంది. మొక్కల వేర్లు లోనికిపోయి తేమ, పోషకాలను ఎక్కువశాతం అందుకుంటుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించవచ్చు. వేసవి దుక్కులు, నేల చదును, విత్తనాల ఎంపిక, శుద్ధి, ఎరువుల వినియోగం, పంటకు అనుగుణంగా నేలను సిద్ధం చేయడం వంటి ప్రణాళిక చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చు.
– పిల్లి కిరణ్, కేవీకే శాస్త్రవేత్త
దుక్కులు దున్నడం..
దుక్కులు దున్నితే తొలకరితో నేల నీటిని పీల్చుకొని పొలంలో తేమశాతం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. వాలుకు అడ్డుగా లోతు దుక్కులు దున్నడంతో వర్షపునీరు వృథా కాకుండా, నేల కోతకు గురికాదు. తోటల్లో దుక్కులతో మొండిజాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటకు వచ్చి పిచ్చిమొక్కల కలుపు నివారణ జరుగుతుంది. నిద్రావస్థలోని కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పేడ, వర్మికంపోస్ట్‌ను దుక్కుల్లో వేసుకోవచ్చు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకముందు రైతులు పత్తి విత్తనాలు విత్తితే ఎండవేడికి భూమిలో మాడిపోయే ప్రమాదం ఉందని, సరైన వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

ముందస్తు సాగుదాం

ముందస్తు సాగుదాం