
ఓసీపీల్లో అధికారులు అప్రమత్తం
● మాన్‌సూన్‌కు ముందస్తు ఏర్పాట్లు ● బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా చర్యలు ● రుతుపవనాల రాకతో అప్రమత్తం
ఏర్పాట్లు పూర్తిచేశాం
వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశాం. డంపర్లు నడిచే హాలేజీ రోడ్ల వెంట నీరు, బురద నిలవకుండా సైడ్ డ్రైన్‌లు నిర్మించాం. వర్షం తగ్గిన వెంటనే బొగ్గు వెలికి తీసేలా అధికారులను సన్నద్ధం చేశాం. ఓబీ, కోల్‌బెంచ్‌ల్లో భారీ విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశాం. మరిన్ని అందుబాటులో ఉంచాం. భారీ యంత్రాలు వరదలో మునిగిపోవకుండా పైబెంచ్‌లో పార్కింగ్ చేసేలా ఆదేశాలిచ్చాం.
– వెంకటయ్య, ఆర్జీ–2 జీఎం
గోదావరిఖని: నైరుతి రుతుపవనాల రాకతో వర్షా లు మొదలయ్యాయి. వర్షాలతో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. భారీవర్షాలు కురిశా బొగ్గు వెలికి తీసేలా ప్రణాళిక రూపొందించింది. రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1, 2లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించాలని సీఎండీ బలరాం ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
ఉత్పత్తిలో కీలకం..
సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తిలో ఓసీపీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓసీపీల్లోంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి వస్తోంది. మిగతా 20శాతం భూ గర్భగనుల ద్వారా వస్తోంది. అయితే, రానున్న మూడు నెలల్లో వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గితే ఈ ప్రభావం ఆర్థిక సంవత్సరంపై పడుతుంది. ఈక్రమంలో యాజమాన్యం ఈసారి వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుకుండా అన్ని ఏరియాల్లోని అధికారులను అప్రమత్తం చేసింది.
వరదతో బురద..
వర్షాలతో ఓసీపీల్లోని హాలేజీ రోడ్లు బురదగా మా రుతున్నాయి. క్వారీల్లోని ఓబీ, కోల్‌బెంచ్‌ల్లో నీటిమ ట్టం పెరుగుతోంది. తద్వారా బెంచ్‌ల్లోని భారీయంత్రాలు నీట మునుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ యంత్రాలు నిత్యం నడిచే క్వారీ హాలేజీ(ప్రధాన) రోడ్లపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వ ర్షాలు కురిసినా రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రైన్‌లు నిర్మిస్తోంది. రోడ్లపై బురద ఎప్పటికప్పుడు తొలగించేందుకు గ్రేడర్లను సిద్ధం చేస్తోంది. వర్షం తగ్గిన వెంటనే రహదారులపై నీరు, బురద తొలగిస్తూ, సైడ్‌డ్రైన్‌లు నిర్మిస్తోంది.
యంత్రాలు నీటమునగకుండా..
భారీవర్షాలు కురిసి ఓసీపీ క్వారీల్లోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో భారీయంత్రాలు నీటమునిగే పరిస్థితులు గతంలో ఉండేవి. కొన్నిభారీ యంత్రాలు నీట మునిగిన ఘటనలూ ఉన్నాయి. ఈక్రమంలో ఓసీపీల్లో నీటి నిల్వలు పెరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సామర్థ్యంగల విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. క్వారీలోని నీటిని ఎప్పటికప్పుడు తోడేసేలా 350 హెచ్‌పీ విద్యుత్ మోటార్లను అమర్చుతున్నారు. అలాగే సబ్ మెర్సిబుల్ పంపుల ద్వారా నీటిని తోడేలా చూస్తున్నారు. క్వారీలోని సంపుల్లో నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
పాంటూన్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు..
భారీవర్షాలతో ఓసీపీ క్వారీలోకి నీరుచేరి అందులో పంపులు మునిగిపోకుండా పాంటూన్ ప్లాట్‌ఫామ్ (నీటిపై తేలియాడే) ఏర్పాట్లు చేశారు. నీటినిల్వలు పెరిగినా నీటిపై తేలియాడే పాంటూన్ ప్లాట్‌ఫామ్‌పై మోటార్లు ఏర్పాటు చేశారు. నీటిని ఎప్పటికప్పుడు తోడేసేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే ఓసీపీల పక్కనే ఉన్న వాగులు, కాల్వలు ఉండటంతో వాటినుంచి వరద ఓసీపీల్లోకి రాకుండా కార్యాచరణ సిద్ధం చేశారు. వాగులు, కాల్వల్లో పూడి కను ఇప్పటికే తొలగించడం వేగవంతం చేశారు.

ఓసీపీల్లో అధికారులు అప్రమత్తం

ఓసీపీల్లో అధికారులు అప్రమత్తం