
‘ఆధార్’ అవస్థలు
● అధికారుల తప్పిదంతోనే తిప్పలు ● సవరించుకునేందుకు వ్యయ‘ప్రయాస’లు ● అందుబాటులో నమోదు కేంద్రాలు లేక ఇబ్బందులు
పెద్దపల్లిరూరల్: ఆధార్ కార్డు అన్నింటికీ ఆధారమైంది. బర్త్, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, బ్యాంకు ఖాతా అవసరం ఉన్నా, స్కూల్‌లో ప్రవేశం కల్పించాలన్నా, కులం, ఆదాయం, నివాసం ధ్రువీకరణపత్రాలు కావాలన్నా, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. తొలుత మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సైతం ఆధార్ కార్డు సర్వీసు బాధ్యతలు ఇచ్చినా.. వారు అక్రమాలకు పాల్పడుతున్నారని అనుమానించి వా రి బాధ్యతలను తొలగించారు.అయితే, ప్రభుత్వ కా ర్యాలయాల ఆవరణలోనే ఏర్పాటు చేయాలని ఉ న్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఎక్కడా అమ లు కావడం లేదు. దీంతో జిల్లాలోని పలు మండలా లు, గ్రామాల ప్రజలు ఆధార్‌కార్డులో దొర్లిన పొరపాట్లను సవరించుకునేందుకు, పుట్టిన పాపాయికి కార్డు కోసం సుదూర ప్రాంతాలకు తిరుగుతూ అనేక వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారు.
పనిచేసేవి నాలుగే..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలో పనిచేసేందుకు ఏడు ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో 4 సెంటర్లే పనిచేస్తున్నాయి. వాటిలో ఒక్క కేంద్రమే జెండా ప్రాంతంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులో అందరికీ అనువుగా ఉంది. కలెక్టరేట్ ఆవరణలో ఉండాల్సిన ఆధార్ కేంద్రాన్ని అమర్‌నగర్ ప్రాంతంలోని ఓ గల్లీలో ఏర్పాటు చేశారు. దాని చిరునామా తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది. కొందరు ఎలాగోలా తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. మరోరెండు కేంద్రాలను బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసినా అక్కడ ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఆధార్ సెంటర్ల తీరుపై సరైనరీతిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఆధార్ అవస్థలను దూరం చేసి సేవలను దగ్గర చేయాలని కోరుతున్నారు.
ఆపరేటర్లకు వసతి కల్పించరా?
ఆధార్ సెంటర్ కలిగియున్న మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వకార్యాలయాల ఆవరణలోనే ఆధార్ సేవలను అందించాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలుకు నోచడం లేదు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకునేందుకు సంబంధిత ఆపరేటర్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ వసతి కల్పించలేదు. దీంతో ఆ కేంద్రాలు పనిచేయడం లేదు.
ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన పంజాల మాధవి కుటుంబం ఇది. వారి బాబు ఆధార్‌కార్డులో దొర్లిన పొరపాటును సవరించుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఆధార్ కేంద్రానికి ఇటీవల వచ్చింది. పొరపాటు సవరణకు అవసరమైన ఆధారాలు లేవని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇతడి పేరు రాజు. పెద్దపల్లి మండలం కుర్మపల్లి స్వగ్రామం. తన కుమారడి ఆధార్‌కార్డు కోసం కేంద్రానికి వచ్చాడు. తహసీల్దార్ కార్యాలయం జారీచేసిన బర్త్ సర్టిఫికెట్‌లో పిన్‌కోడ్ లేదని ఆధార్ కార్డు ఇచ్చేందుకు నిర్వాహకులు తిరస్కరిస్తున్నారని వాపోయాడు.
ఇబ్బంది రావొద్దు
కలెక్టరేట్‌తోపాటు అన్నిమండల కేంద్రా ల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సర్కారు ఆఫీసుల్లో ఆధార్ సెంటర్లు ఉంటే ఏ సమస్య వచ్చినా అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించే అవకాశముంటుంది. కలెక్టర్ చొరవ చూపి వీలైనంత త్వరగా ఏర్పాటు చేయించాలి.
– కందుల శ్రీనివాస్, సుల్తానాబాద్
ఆదేశాలు ఉన్నాయి
మీసేవ కేంద్రాలు, ఇతర భవనాల్లో ఏర్పాటు చేసుకున్న ఆధార్ సెంటర్లను ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోకి మార్చాలనే ఆదేశాలున్నాయి. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– గంగయ్య, ఆర్డీవో, పెద్దపల్లి

‘ఆధార్’ అవస్థలు

‘ఆధార్’ అవస్థలు

‘ఆధార్’ అవస్థలు

‘ఆధార్’ అవస్థలు