
విద్యార్థినిని అభినందిస్తున్న నరేందర్‌రెడ్డి
కరీంనగర్ స్పోర్ట్స్: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ విద్యార్థిని కె.వందన ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పాఠశాలలో ఆమెను అభినందించారు. విలువిద్యలో నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయని, ముఖ్యంగా ఏకాగ్రతను పెంపొందించే విధానం తెలుసుకుంటామని అన్నారు. క్రీడలతో చాలా లాభాలు ఉంటాయని, ప్రతీ విద్యార్థి రాణించాలని సూచించారు. ఇటీవల మహబూబాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలబాలికల ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వందన ప్రతిభ కనబరిచిందని తెలిపారు. త్వరలో గుజరాత్‌లో నిర్వహించే జాతీయ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కనగర్తి సర్పంచ్ అత్త దారుణ హత్య
ఇల్లందకుంట(హుజూరాబాద్): తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న కోపంతో ఓ వ్యక్తి ఇల్లందకుంట మండలంలోని కనగర్తి సర్పంచ్ అత్తను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కనగర్తికి చెందిన రామంచ కుమార్‌కు ఆరు నెలల క్రితం వివాహమైంది. దంపతుల మధ్య మనస్పర్థలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు పంచాయితీలు జరిగినా ఫలితం లేకపోయింది. అయితే, గ్రామానికే చెందిన మట్ట లచ్చవ్వ(70) కుమారుడు, స్థానిక సర్పంచ్ భర్త వాసుదేవరెడ్డి తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని కుమార్ కోపం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నానా హంగామా చేశాడు. పంచాయతీ కార్యాలయ తలుపులపై కిరోసిన్ పోసి, నిప్పంటించాడు. స్థానికులు అడ్డుకోవడంతో నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు కూర్చున్న వాసుదేవరెడ్డి తల్లి లచ్చమ్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. గ్రామస్తులు అడ్డుకొని, అతన్ని కట్టేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సంఘటన స్థలాన్ని హుజూరా బాద్ ఏసీపీ జీవన్‌రెడ్డి, జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, ఎస్‌ఐ రాజ్‌కుమార్ పరిశీలించారు. నిందితుడు కుమార్‌ను అదుపులోకి తీసుకొని, విచారణ జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.

నిందితుడిని కట్టేసిన గ్రామస్తులు