
ఈవీఎంలు భద్రపర్చిన జేఎన్టీయూ
మంథని: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించే మంథని అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆదివారం వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే దానిపైనే అందిరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మధ్యే ప్రధాన పోటీ ఉంది. వీరిద్దరూ ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విలక్షణమైన తీర్పు ఓటర్ల సొంతం..
మంథని ఓటర్లకు విలక్షణమైన తీర్పు ఇచ్చే రివాజు ఉంది. దేశ ప్రధానిగా సేవలు అందించిన దివంగత పీవీ నరసింహారావు, ఉమ్మడి ఏపీ శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించిన శ్రీపాదరావుతోపాటు మంథని శాసన సభ్యుడిగా ఉన్న శ్రీధర్‌బాబుకు నా లుగుసార్లు పట్టం కట్టి రాష్ట్రమంత్రిగా పనిచేసే అ దృష్టాన్ని ఇక్కడి ప్రజలు అందించారు. అలాగే 2014 ఎన్నికల్లో మొదటి బీసీని ఎమ్మెల్యేగా గెలిపించి మంథని నియోజకవర్గ ప్రజల నాడి ఎవరూ పసిగట్టకుండా విలక్షణ తీర్పు ఇచ్చారు. ఈసారి మంథని మకుటంపై ఓటర్లు ఎవరిని కూర్చోబెడతారనే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
10 మండలాలు.. 288 పోలింగ్ కేంద్రాలు..
నియోజకవర్గంలోని పది మండలాల్లో 288 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,422 మంది ఓటర్లకు 1,75,995 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రామగిరి మండంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఎన్నికల లెక్కింపు కేంద్రంలో ఆదివారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు రోజులు, పోలింగ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
గెలుపుపై ఎవరి ఽధీమా వారిదే
ప్రజాతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
అందరిచూపు మంత్రపురి వైపే