
● గెలుపుపై అభ్యర్థుల అంచనాలు ● మూడు సెగ్మెంట్లలో ద్విముఖ పోటీ ● తగ్గిన పోలింగ్ తమకే అనుకూలమంటున్న పార్టీలు ● పోలింగ్ సరళి, ప్రలోభాల అంచనాల్లో నాయకులు ● పోలింగ్ కేంద్రాల వారీగా సమీక్షలు ● సైలెంట్ ఓటింగ్‌పై అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, పెద్దపల్లి: తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? ఏ పోలింగ్ కేంద్రంలో మనకు మొరుగ్గా ఓట్లు పడ్డాయి? ఎక్కడెక్కడ తగ్గనున్నాయి.? అనేలా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన పార్టీల నాయకులు గెలుపు అంచనాలపై లెక్కలేస్తున్నారు. ఎవరికి వారుగా గెలుపు ధీమాను తమ అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సరళిని గమనిస్తున్న నాయకులు.. తగ్గిన పోలింగ్ తీరుతో ఎవరికి ఇబ్బందనే విషయమై రాజకీయ విశ్లేషకులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వారీగా వెల్లడైన పోలింగ్ శాతాన్ని తెప్పించుకొని వివిధ సామాజికవర్గాల ప్రాబల్యాల ఆధారంగా అంచనా వేస్తున్నారు.
ద్విముఖ పోటీయే
● జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు బరిలో నిలిచాయి. పోలింగ్ పూర్తయ్యేసరికి కేవలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. రామగండంలో అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో కొంత బీజేపీ ప్రభావం కనిపించింది. మిగతా చోట్ల ఈ రెండుపార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.
ఎవరు గెలిచినా మెజార్టీ తక్కువేనా?
అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక తమకు విజయాన్ని తెచ్చి పెడుతుందని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో నెలకొన్న సానుకూలత ఆధారంగా తమకు ప్రజలు ఓటు వేస్తారని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో ఉండే సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిస్తే తమకే విజయవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి బలమైన ఓటుబ్యాంకు అయిన సంక్షేమ పథకాల లబ్థిదారులు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మెగ్గుచూపారని, పోల్ మెనేజ్‌మెంట్‌లో బీఆర్‌ఎస్ చతికిలబడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బూత్‌ల వారీగా లెక్కలు
మరోవైపు.. నియోజవర్గంలోని పోలింగ్ కేంద్రాల వారీగా పంచిన తాయిలాల వివరాలు, అందులో ఓటు వేసిన వారు ఎందరు? ప్రత్యర్థి పార్టీకి క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరు? సైలెంట్ ఓటరు ఎటు వైపు ఉన్నాడు? అనే లెక్కల్లో అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు. ఓటర్లుకు ఇచ్చేందుకు అందజేసిన నగదులో చేతివాటం చూపింది ఎవరు? అనే అంశాల పోస్ట్‌మార్ట్‌ం పనుల్లో శుక్రవారం పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు బిజీబిజీగా తమ అనుచరులతో మంతనాలు సాగిస్తూ కనిపించారు.