
ఈవీఎంలతో పెద్దపల్లికి చేరుకుంటున్న సిబ్బంది
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికలు గురువారం ము గియటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈవీఎంలలో ఎమ్మెల్యేల అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. ఈనెల 3న ఆదివారం రోజు కౌంటింగ్ జ రుగనుంది. ఫలితాలపై అభ్యర్థులతో పాటు ఓటర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అంచనాలకు అందడం లేదు. ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరగటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 838 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం, వీవీప్యాట్)లను పోలింగ్ కేంద్రాల నుంచి రామగిరి మండలంలోని జేఎన్‌టీయూ కాలేజీలో ఏర్పా టు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.
పోలింగ్ సరళిపై చర్చ
పోలింగ్ ముగియటంతో జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల పైనే చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రేపు, ఎల్లుండి ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటింగ్ తీరు తెన్నలతోపాటు పార్టీ విజయావకాశాలను ఎమ్మెల్యే అభ్యర్థులు విశ్లేషించుకోనున్నారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై పోస్టుమార్టం
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి వివి ధ పార్టీలు తాయిలాలు, నోట్లు పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. అయితే అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణులు చేతివాటంతో పూర్తిస్థాయిలో ఓటర్లకు చేరలేదు. దీంతో నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఓటర్లు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే పోల్ మేనేజ్‌మెంట్ చేయటంతో అధికార పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ గెలు పుపై ఆశలు పెట్టుకోగా, త్రిముఖ పోటీలో వ్యతిరేక ఓటు చీలి తమకే గెలుపు వరించనున్నదని బీఆర్‌ఎస్ శ్రేణులు అంచనాలు వేస్తున్నారు. ఎవరి అంచనాలు నిజమయ్యేది డిసెంబర్ 3న తేలనుంది.
స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్న ఈవీఎంలు, వీవీప్యాట్‌లు
ఈనెల 3న జేఎన్‌టీయూలో కౌంటింగ్
పెరిగిన పోలింగ్ శాతంతో అభ్యర్థులో టెన్షన్

ఈవీఎంలను అధికారులకు అప్పగిస్తున్న సిబ్బంది