మెరుపు చూసి మసులుకో..! | - | Sakshi
Sakshi News home page

మెరుపు చూసి మసులుకో..!

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

మెరుపు చూసి మసులుకో..!

విజయనగరం గంటస్తంభం: ఆకాశం కొంచెం మబ్బు పట్టిందంటే చాలు.. వాన పడుతుందని సంబరపడాలో, లేక ఎప్పుడు ఏ పిడుగు మీద పడుతుందోనని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముసురు పట్టిందంటే ముచ్చటగా ఉండాలి కాని ముంచుకొచ్చే ముప్పులా మారుతోంది. వానకాలం వచ్చిందంటే చాలు.. ఆకాశంలో మెరుపులు మెరవడం, ఉరుములు ఉరమడం మామూలే అనుకుంటే పొరపాటే. ఆ మెరుపు వెనుక మృత్యువు దాగి ఉంది. ఆకాశం నుంచి నిప్పుల కొలిమి పిడుగు రూపంలో వచ్చి పడుతోంది. ఈ మధ్య కాలంలో విజయనగరం జిల్లాలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నామా.. ఇంక అంతే సంగతులు.

పిడుగుపాటు...చావు దెబ్బ..!

ఏటా పదుల సంఖ్యలో పిడుగులు పడి ప్రజలు చనిపోతుండడం బాధిస్తోంది. పొలం గట్ల మీద పని చేసే రైతన్నలు, వానొస్తుందని చెట్ల కింద తలదాచుకునే కూలీలు, గొర్రెలు, మేకలు కాసే కాపరులే ఎక్కువగా ఈ పిడుగులకు బలైపోతున్నారు. మెరుపు కనిపించినప్పుడు గుండె ధైర్యం ప్రదర్శిస్తే కుదరదు.. అక్కడ నుంచి తెలివిగా తప్పించుకోవడమే ముఖ్యం.

ఏప్రిల్‌ – జూన్‌ మధ్యనే అధికం..

ఏటా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనే పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ఆ సమయంలో సముద్రంలో నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగి దట్టమైన క్యూములోనింబస్‌ మేఘాలు కమ్ముకుంటాయి. అప్పుడే ఉరుములు ప్రారంభమై పిడుగులు పడుతుంటాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు.

ముందస్తు సమాచారం ఇచ్చేలా...

పిడుగు పాటును ముందుస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. దీనికోసం ఎర్త్‌ నెట్‌వర్క్‌ ద్వారా రాష్ట్రంలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు.

కళ్లెదుటే ప్రమాదాలు..

మొన్నటికి మొన్న వంగర మండలంలో జరిగిన ముచ్చట వింటే ఎవరికై నా కన్నీళ్లు ఆగవు. ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతు పొలంలో పనులు చేసుకుంటా ఉండగా..ఒక్కసారిగా ఉరుము ఉరిమి పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అట్లాడే రేగ గ్రామంలో కూడా పిడుగు పడి ఎనిమిదో తరగతి చరువుతున్న చరణ్‌ తేజ అనే కుర్రాడు చనిపోవడం ఊరందరినీ కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా మరెన్నో చోటుచేసుకుంటున్నాయి.

ప్రాణాలు తీస్తున్న పిడుగులు

ఏటా పదుల సంఖ్యలో మరణాలు

అప్రమత్తతతోనే ప్రమాదాలకు దూరం

రైతులు, కూలీలు, పశువులు,

గొర్రెల కాపరులే బలి

అప్రమత్తతే ప్రాణాలకు రక్ష..

పత్రికలు, టీవీల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకోవడంతో పాటు స్థానిక అధికారులు చేసే హెచ్చరికలు పాటించాలి.

పిడుగులు ఎత్తైన భవనాలు, స్తంభాలు, వృక్షాలపై పడే అవకాశం ఎక్కువ. దీంతో వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

ఉరుముల సమయంలో తప్పించుకునేందుకు స్థలం లేకపోతే కిందకు వంగి ఉండాలి.

కూర్చున్నప్పుడు పాదాల ముందు భాగం మాత్రం నేలను తాకాలి. మిగిలిన ఏ భాగం నేలను తాకకుండా జాగ్రత్త పడాలి.

ఉరుములు, మెరుపుల సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు. మేఘాల్లోని విద్యుత్‌ తరంగాలతో ఎలక్ట్రానిక్‌ పరికరాలు పేలుడుకు గురయ్యే ప్రమాదం ఉంది. గృహాల్లో ఉండే టీవీలు, ఫ్రిజ్‌లు ,ఇన్వర్టర్లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికాలకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement