సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు కళంకం తీసుకొస్తున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి అన్నారు. టీటీడీలాంటి పవిత్ర స్థలానికి.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే బీఆర్ నాయుడు వంటి వ్యక్తిని చైర్మన్‌గా కొనసాగించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన అఘాయిత్యాలు, రాసలీలలను ఖండిస్తూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు.. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. బీఆర్ నాయుడు లాంటి కామాంధుడిని వెనకేసుకు రావడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో ఓ వైపు కల్తీ నెయ్యి వినియోగించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. మరోవైపు రాసలీలలకు తెగబడిన టీటీడీ చైర్మన్‌ను విధులనుంచి తొలగించాలని సామాన్య భక్తులు సైతం కోరుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చీమకుట్టినట్టైనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బీఆర్ నాయుడు
అలాంటి వారిని వెనుకేసుకుని రావడానికి సిగ్గు లేదా?
తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలి
వైఎస్సార్ సీపీ నాయకుల డిమాండ్
జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు
పార్వతీపురం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వందలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి బెలగాం ప్రధాన రహదారి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తిరుమల పవిత్రతను కాపాడేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా నినదించారు.


