పార్వతీపురం: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మంత్రి పార్వతీపురానికి చేరుకుని, 10.30 గంటలకు సీతానగరం బ్రిడ్జి, మక్కువ–అజ్జాడ రహదారి ప్రారంభోత్సం, 11.15 గంటలకు సీతానగరం–అరసాడ, 11.45కు అరసాడ రోడ్డు, 12 గంటలకు చిలకలపల్లి వయా బలిజిపేట రోడ్డు, 12.10కు పార్వతీపురం వయా కలవరాయి, టీపీ ఇంజనీరింగ్ కళాశాల రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్వతీపురం చేరుకొని, 1.30 గంటలకు అధికారులతో సమీక్షిస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పార్వతీపురం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళతారని తెలిపారు.
డీఈఈ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లిమర్ల: డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్–2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకష్ణారావు పిలుపునిచ్చారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధి కలిగిన డిప్లమా కోర్సులో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్లో ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఇన్ లేదా ఏపీడీఈఈసెట్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్. ఇన్ అనే వెబ్ సైట్లో సమాచారం పొందవచ్చన్నారు. శిక్షణలో చేరేసమయానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
నేడు జగ్జీవన్‌రామ్ జయంతి
పార్వతీపురం: మాజీ ఉప ప్రధాని, స్వాంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 119వ జయంతిని పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తామని కలెక్టర్ ప్రభాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం పార్వతీపురం మెయిన్ రోడ్డులోని సౌందర్య థియేటర్ కూడలి వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జయంతిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పీఎఫ్ ఖాతాల నిర్వహణపై నిర్లక్ష్యం తగదు
● జెడ్పీ సీఈఓకు పీఆర్‌టీయూ జిల్లా కమిటీ ఫిర్యాదు
విజయనగరం అర్బన్: జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా రాజాం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలు ప్రారంభించకపోవడం తగదని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ ఖాతాలు జిల్లాలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ బీఏ సత్యనారాయణకు శనివారం విజ్ఞప్తి చేశారు.
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం ప్రాథమిక పాఠశాలను ఆ గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. పాఠశాలను రెండేళ్ల కిందటి వరకు స్థానికంగా ఉన్న మిషనరీ సంస్థ నడిపేది. పాఠశాల నిర్వహణ భారం కావడంతో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే 36 మంది విద్యార్థులతో ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం ఇక్కడి చిన్నారులకు చదువుచెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అయితే, పాఠశాలకు వసతి లేకపోవడంతో సచివాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో ఐదు తరగతుల బోధ నకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సచివాలయానికి వివిధ పనులపై వచ్చేవారివల్ల బోధనకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల భవనాలు నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.


