పార్వతీపురం రూరల్: స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ముగిసింది. జిల్లా వ్యవసాయ మేనేజర్ జి.సత్యవతి అధ్యక్షతన జరిగిన సదస్సులో జిల్లాలోని 4 డివిజన్ల నుంచి ఏడీఏలు, 15 మండలాల్లో పని చేస్తున్న ఎంఏఓలతో పాటు డీఆర్‌డీఏ ఏపీడీ జయశ్రీ, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన అధికారులు త్వరలో మండల స్థాయిలో వీఏఏ, వీహెచ్‌ఏ, ఎఫ్.ఎమ్.టిలు, కృషి సఖీలకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మూడు రోజులు తరగతి గది శిక్షణ, రెండు రోజులు క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ప్రాచీన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూసారంతో పాటు మానవ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతులు నవధాన్యాల సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన్యం జిల్లాలో ఉద్యాన పంటలు ఇప్పటికే ప్రకృతి సిద్ధంగా సాగువుతున్నాయని డీహెచ్‌ఓ సత్యం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయం పొందేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పంటల ప్రణాళికను సిద్ధం చేసినట్లు రీజనల్ థీమాటిక్ లీడ్ ప్రకాష్ తెలిపారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింపజేసే ‘ఆఫ్ మూన్ డ్రాట్ ప్రూఫింగ్’ నమూనాను ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ మేనేజర్ ఎం.శ్రావణ్ కుమార్‌నాయుడు, రీజనల్ టెక్నికల్ అధికారి హేమసుందర్, ఏడీఏలు శారద, శంకరరావు, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


