పులకించిన రామతీర్థం..! | - | Sakshi
Sakshi News home page

పులకించిన రామతీర్థం..!

Feb 16 2026 7:39 AM | Updated on Feb 16 2026 7:39 AM

పులకి

పులకించిన రామతీర్థం..!

పులకించిన రామతీర్థం..!

వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు అవస్థలు

తరలివచ్చిన భక్తజనం

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిఖర జ్యోతి

నెల్లిమర్ల రూరల్‌: మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం భక్త జనంతో ఆదివారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడ శివుని తారక మంత్రం జపించారని విశ్వసించిన భక్తులు.. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి మరీ రాముడి సన్నిధిలో శివరాత్రి జాగరణ చేశారు. దీంతో భక్తులు తమ హృదయాల్లో శివకేశవులకు బేధం లేదని చాటారు. శ్రీరామస్వామివారి ఆలయం, ఆలయ క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ ఆలయం, రామకోనేరు, బోడికొండ, గురుభక్తుల కొండ, దుర్గాభైరవ కొండ తదితర ప్రాంతాలన్నీ భక్తజనంతో కిక్కిరిసాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. దేవస్థాన పరిధిలో చుట్టు పక్కల ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని కాగడాలు వెలిగించి ఆదివారం రాత్రంతా శివ జాగరణం చేశారు.

ఉమాసదాశివాలయంలో ప్రత్యేక అభిషేకాలు

రామాలయ క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న శ్రీ ఉమాసదాశివ ఆలయంలో అర్చకస్వామి మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. స్వామి సన్నిధిలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ౖవైభవంగా జరిపించారు. 11 రకాల ఫల రసాలు, భస్మ, చందన, హరిద్రా కుంకుమ, సుగంధ ద్రవ్య, నారికేళ జలాలుతో శివుడికి మహాభిషేకాన్ని జరిపించారు. సరిగ్గా అర్ధరాత్రి 12గంటలకు మహా లింగోద్భవ సమయంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించి భస్మ పూజ, అష్టమూర్తి హారతి, త్రయంబిక మంత్ర జపం తదితర కార్యక్రమాలు జరిపించారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిఖర జ్యోతి

రామతీర్థం సేవా సంఘం, దాతల సహకారంతో బోడి కొండ పర్వతంపై శిఖర దీపాన్ని సాయంత్రం 6గంటలకు భక్తి శ్రద్ధలతో వెలిగించారు. కొండపై ఏర్పాటు చేసిన శిఖర స్తంభం వద్ద అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా రెండు రోజుల పాటు ఈ శిఖర దీపం కొండపై వెలగనుంది. భక్తులు పర్వతంపైకి చేరుకొని భక్తిశ్రద్ధలతో శిఖరదీపాన్ని దర్శించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో శిఖరదీప మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అంబళ్ల శ్రీరాములనాయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు తదితర ప్రముఖులు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఏస్పీ సౌమ్యలత, ఆర్‌డీఓ కీర్తి, ఈఓ వై.శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్సై గణేష్‌ తదితరులు ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించారు. రామతీర్థం శివరాత్రి మహోత్సవాలకు విచ్చేసిన పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖలతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు తొలి రోజు సేవలు అందించారు. సతివాడ, కొండవెలగాడ పీహెచ్‌సీలు, మిమ్స్‌ వైద్య కళాశాల ఆధ్వర్యంలో వైద్య సేవలు కొనసాగాయి.

రామతీర్థం మహాశివరాత్రి ఉత్సవాల్లో వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఒక్క ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెంట సుమారు 50 మంది కుటుంబ సభ్యులు, అనుచరులు రావడంతో రామాలయంతో పాటు శివాలయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఒకేసారి అంత మంది రావడంతో అక్కడున్న పోలీసులు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అర్చనలు, ఆశీర్వచనాలు చేయడంతో స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్న భక్తులు విసుక్కునే పరిస్థితి తలెత్తింది.

పులకించిన రామతీర్థం..! 1
1/1

పులకించిన రామతీర్థం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement