నాగావళి తీరాన.. శివ నామస్మరణ
కొమరాడ: మహాశివరాత్రి పర్వదినాన శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. కోటిపాం పంచాయతీ దేవునిగుంప సమీపంలోని నాగావళి నదీ వద్ద జంఝావతి సంగమంలో వెలిసిన శ్రీగుంప సోమేశ్వరుడు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం వేకువజాము నుంచే దర్శనానికి క్యూ కట్టారు. నాగావళి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులకు దేవదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు మండిపడ్డారు. మండుటెండలోనే సోమేశ్వరుడిని దర్శించుకున్నారు. పలు సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు తాగునీరు, మజ్జిగ, అన్నదానం ఏర్పాటు చేశారు. మండలంలోని రాజ్యలక్ష్మీపురం, చోళ్లపధం, కొమరాడ, పాలేం తదితర గ్రామాల్లో కూడా శివాలయాలు శివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడాయి.
నేడూ కొనసాగునున్న యాత్ర
గుంప సోమేశ్వరుడు ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం రాత్రి అక్కడే జాగారం చేసి వంటలు ఏర్పాటు చేసుకుని రాత్రి రెండు గంటల నుంచి స్నానాలు ఆచరించి మహాశివుని దర్శనం చేసుకొని తిరిగి ఇంటి ప్రయాణం చేస్తారు. దీంతో సోమవారం కూడా ఈ ప్రాంతంలో జాతర జరగనుంది.
గుంప సోమేశ్వరుడి ఆలయాన మార్మోగిన శివనామస్మరణ


