పారమ్మ కొండపై భక్తజనం
పాచిపెంట: మహాశివరాత్రి పర్వదినాన మండలంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు, మంచాడవలస గోకర్ణేశ్వరాలయం కర్రవలస, పాంచాలి పెద్దవలస, గురువు నాయుడుపేట శివాలయాలు వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవం పారమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. పారమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులు ఉదయం నుంచి బారులు తీరి ప్రత్యేక పూజలు చేశారు. కొండ దిగువ నుంచి పైకి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా దేవదాయ శాఖతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు సేవలను అందించారు. తాగునీరు సౌకర్యంతో పాటు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాలూరు ఆర్టీసీ డిపో నుంచి సుమారు 50 ఆర్టీసీ బస్సులు నడిపారు. 130 మంది పోలీసులు పది మంది ఎస్‌ఐలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీ మాధవరెడ్డితో పాటు ఏఎస్పీ సందర్శించి భద్రతపై సీఐను ఆరా తీశారు. సాలూరు సనాతన ధర్మ పరిషత్ పారమ్మ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో కొండపైన అఖండ జ్యోతి వెలిగించారు. కొండ దిగువన పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి, ఉచిత ప్రసాదాలు అందజేశారు.
పారమ్మ కొండపై భక్తజనం


