ఆరేళ్లకే నిండిన నూరేళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్లకే నిండిన నూరేళ్లు

Feb 16 2026 7:17 AM | Updated on Feb 16 2026 7:17 AM

ఆరేళ్లకే నిండిన నూరేళ్లు

ఆరేళ్లకే నిండిన నూరేళ్లు

రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి

రాజాం సిటీ: ఆ ఇంట విధి వక్రించింది. పెళ్‌లై ఏళ్లు గడుస్తున్నప్పటికీ సంతానం లేకపోవడంతో మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం చేసిన పూజలు ఫలించి ఆ దంపతులకు లేకలేక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడిని తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చిట్టిపొట్టి మాటలాడుతుండడంతో వారంతా మురిసిపోయారు. వారి ఆనందాన్ని చూసిన విధి కన్నెర్రజేసింది. ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోవడంతో ఆ కుటుంబ ఆశల దీపం ఆరిపోయింది. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతిచెందడంతో ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై తల్లిదండ్రుల విషాదానికి అంతేలేదు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన మడ్డు నారాయణరావు, ఆదిలక్ష్మి దంపంతులకు లోహత్‌ సాయి (6) పెళ్‌లైన ఏడేళ్ల తరువాత జన్మించాడు. నారాయణరావు తాపీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడు తాము అనుభవిస్తున్న బాధలు పడకూడదనుకున్నారు. రాజాంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించి చదివించుకుంటున్నారు. మహాశివరాత్రి కావడంతో లోహిత్‌సాయి తమ తాతగారి ఊరైన ఇప్పిలిపేట గ్రామంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వచ్చాడు. అక్కడ రోడ్డు దాటుతుండగా చీపురుపల్లి నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొని గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రాజాంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితో చలాకీగా ఉంటూ ఎంతో హుషారుగా ఉన్న బాలుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై పి.ఉమావెంకటేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement