క్లోరిన్ గ్యాస్ లీక్
● ఆరుగురికి అస్వస్థత
బలిజిపేట: మండలంలోని అంపావల్లి పంప్‌హౌస్‌లో క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు లీకవడంతో సమీప నివాసగృహాల్లో ఉండే ఆరుగురు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వారిని వైద్యసేవల నిమిత్తం బలిజిపేట పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్‌సీలో వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి ప్రాథమిక వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా హాస్పిటల్‌కు పంపించారు. అంపావల్లి పంప్‌హౌస్‌లో చాలాకాలం నుంచి వినియోగించకుండా నిరుపయోగంగా 3క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు మూలనపడి ఉన్నాయి. అవి లీకవడంతో పంప్‌హౌస్‌కు సమీపంలో ఉండే నివాసగృహాలలో ఉండే వారికి సోకడంతో వెంటనే అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు, వేరువేరు గృహాలలో ఉండే మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే అధికారులకు తెలియజేశారు. అస్వస్థతకు గురైన బి.సురేష్, ఆర్.రాధ, ఐ.కామేశ్వరి, బి.మురళీకుమారి, బి.కుమారి, బి.సుధాకర్‌లను వెంటనే బలిజిపేట పీహెచ్‌సీకి తరలించారు. వీటిని ఇక్కడ ఉంచకుండా తీసుకువెళ్లిపోమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు గ్రామస్తులు పలు పర్యాయాలు తెలియపరిచినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అవి లీక్ అయి ప్రమాదకరంగా మారినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో క్లోరిన్ గ్యాస్ ప్రభావం ఇంకా ఏమైనా ఉందా అనేదానిపై వైద్యశాఖ ఇంటింటి సర్వే నిర్వహించింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వై.విజయమోహన్ గ్రామాన్ని సందర్శించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్లోరిన్ గ్యాస్ లీక్


