అవయవదానం మహాదానం
వంగర: అవయవ దానం మహాదానమని ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ అన్నారు. మండల పరిధి కె.కొత్తవలస గ్రామానికి చెందిన రైతు పెంకి పారినాయుడు కొద్ది రోజులుగా శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులు పారినాయుడు అవయవాలు( కాలేయం, కిడ్నీలు, కళ్లు) దానం చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సురేష్‌ముఖర్జీ కె.కొత్తవలస గ్రామానికి చేరుకొని పారినాయుడు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. పారినాయుడు భౌతికంగా లేకపోయినా అవయవదానం చేసి సజీవంగా ఉన్నాడని తెలిపారు. నివాళులర్పించిన వారిలో రెడ్‌క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్యకుమార్, పెంకి పోలిరాజు, పెంకి శ్రీను ఉన్నారు.


