సివిల్స్ పరీక్షల్లో విశ్లేషణాత్మక నైపుణ్యాలు కీలకం
● ఐఆర్‌ఎస్ కేడర్ అడిషనల్ కమిషనర్ ఎన్.సృజన్‌కుమార్
విజయనగరం అర్బన్: దేశంలో అత్యున్నత స్థాయి ఉద్యోగ సర్వీసు అయిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడానికి విద్యార్థులలో విశ్లేషణాత్మక నైపుణ్యాలు కీలకమని కేంద్ర ప్రభుత్వ ఐఆర్‌ఎస్ కేడర్ అడిషనల్ కమిషనర్ ఎన్.సృజన్‌కుమార్ అన్నారు. సీతం ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల అవగాహన కోసం ‘సివిల్ సర్వీసెస్ – లక్ష్య సాధన’ అనే అంశంపై శనివారం నిర్వహించిన డిజిటల్ వేదిక వెబినార్ (ఆన్‌లైన్ అవగాహన సదస్సు)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులో ఉన్న నేటి కాలంలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మరింత సులభతరమైందని తెలియజేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ విశ్లేషణాత్మక నైపుణ్యాలను యూపీఎస్సీ పరీక్షల్లో సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, దేశ సేవ చేసే గొప్ప వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్ విద్యతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సదస్సులో విద్యార్థులు అడిగిన పలు సందేశాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్ సదస్సుకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.


