మూడో బడ్జెట్లోనూ అబద్ధాలు, మోసాలే..
సాక్షి, పార్వతీపురం మన్యం : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లోనూ అంతా అబద్ధాలు, మోసాలేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై శనివారం ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్.. సూపర్ సెవన్ అంటూ హడావిడి చేసి, ప్రజలకు మరోసారి మొండిచేయి చూపారని అన్నారు. బుకాయింపులు.. బాబు, చినబాబులకు జాకీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ ఊసు లేదన్నారు. పాఠశాలల్లో నాడు – నేడు పనులను అటకెక్కించారని.. టోఫెల్, సీబీఎస్‌ఈ, ఐబీలను రద్దు చేస్తున్నామని ఆర్థిక మంత్రితోనే చెప్పించిన చంద్రబాబు బడ్జెట్‌లో అంకెలు తప్ప ఆదాయాలు లేవన్నారు. అప్పులమీద అప్పులతో రికార్డులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఖర్చు చేస్తారా? లేదా?
2025–26 ఏడాదికి ప్రతిపాదిత బడ్జెట్ రూ.3,22,359 కోట్లను సవరించి రూ.3,00,535 కోట్లకు తగ్గించారని తెలిపారు.. ఇది కూడా ఖర్చు చేశారా? లేదా? అన్నది ఏడాది మార్చికి తెలుస్తుందన్నారు. గత ఏడాది రాష్ట్ర పన్ను, పన్నేతర ఆదాయం అంచనాలు రూ.1,28,126 కోట్లు అయితే, సవరించిన అంచనాల ప్రకారం దాన్ని రూ.1,11,865 కోట్లకు తగ్గించారన్నారు. అందులోకూడా మొదటి తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయం రూ.67,459 కోట్లు మాత్రమేనని.. మిగిలిన మూడు నెలల్లో ఇంకో 44,407 కోట్లు రావాలంటే.. రెట్టింపు ఆదాయలు ఉండాలని, వాస్తవానికి ఆ పరిస్థితి లేదని వివరించారు. ‘2025–26లో మొదటి 9 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు చూస్తే రూ. 81,597 కోట్లు. ఇంకా మూడు నెలల్లో అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బడ్జెట్ ప్రతుల్లో సవరించిన అంచనాల్లో 12 నెలలకు రూ.80, 567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. అంటే చేసిన అప్పులను పారదర్శకంగా వెల్లడించడం లేదని అర్థం అవుతోంది. మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిరకాల అప్పులు చూస్తే ఏకంగా రూ.3.12 లక్షల కోట్లకు చేరాయ’ని రాజన్నదొర తెలిపారు. మొత్తం రూ.97 వేల కోట్లు అప్పులు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదన ఉందని.. ఇప్పటికే అప్పుల్లో దేశంలో నెంబర్ 1గా చంద్రబాబు ప్రభుత్వం నిలిచిందని చెప్పారు.
నిరుద్యోగులకు టోకరా..
నిరుద్యోగులకు బడ్జెట్‌లో టోకరా పెట్టారని రాజన్నదొర అన్నారు. పైసా కూడా కేటాయించలేదన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఏటా రూ.7,200 కోట్లు ఇవ్వాలని చెప్పారు. మూడేళ్లలో రూ.21,600 కోట్లు ఎగవేతకు పాల్పడిందని విమర్శించారు. ప్రతీ మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని మోసం చేసిందన్నారు. ‘18 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న 1.8 కోట్ల మంది మహిళలకు ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. మూడేళ్లలో ఎగ్గొట్టింది రూ.97,200 కోట్లు’ అని తెలిపారు. అన్నదాత సుఖీభవకు కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ‘2025–26లో ఒక్క రైతు కుటుంబానికి రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.10వేలు. రూ.30వేల బకాయి. పైగా 6.72 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క రూపాయికూడా లేద’ని చెప్పారు. తల్లికి వందనం కూడా ఒక మోసమేనని తెలిపారు. రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతుంటే, రూ.15వేల వంతున ఏటా రూ.13,112 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారని చెప్పారు. 2025–26లో పిల్లల సంఖ్యను దాదాపు 21లక్షలు తగ్గించి, కేవలం 66 లక్షల మందికి రూ. 8,389 కోట్లు ఇచ్చామన్నట్టుగా బడ్జెట్ పద్దులో చూపిస్తున్నారని తెలిపారు. చాలామందికి రూ. 8వేలు, 9వేలు, రూ.10వేలు మాత్రమే పడ్డాయన్నారు. ఈ ఏడాదికూడా లెక్కల్లో రూ.8,456 కోట్లు మాత్రమే తల్లికి వందనం కింద ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. ధరల స్థిరీకరణకు కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారని.. చంద్రబాబు వచ్చాక అమాంతంగా పడిపోయిన ధరలతో రైతులకు అష్టకష్టాలు పడుతున్నారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇప్పటికే విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు రూ.8 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని తెలిపారు. బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లకు అరకొర కేటాయింపులు చేశారన్నారు. మహిళా సంక్షేమానికి మొండిచెయ్యి చూపారని, డ్వాక్రా మహిళలకు 10లక్షల సున్నా వడ్డీ రుణాలకు ఎగనామం పెట్టారని తెలిపారు. పీఆర్సీ, ఐఆర్ పై ప్రస్తావన లేకుండా బడ్జెట్ ఉందన్నారు. సీపీఎస్ రద్దుపైనా ఎక్కడా ప్రస్తావించని ప్రభుత్వం.. ఉద్యోగులను మోసం చేసిందని రాజన్నదొర విమర్శించారు.
సూపర్ సిక్స్.. సూపర్ సెవన్‌కు మరోసారి మొండిచేయి
బుకాయింపులు... బాబు, చినబాబులకు జాకీలు
చంద్రబాబు బడ్జెట్‌లో అంకెలు తప్ప ఆదాయాల్లేవ్..
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు రాజన్నదొర


