జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చలో అమరావతి
● ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆంజనేయులు
పార్వతీపురం: రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఏపీ ఎన్‌జీఓ హోంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాల్లో పింఛన్ సౌకర్యం ఉందని, ఏపీలోకూడా పింఛన్ మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. జర్నలిస్టుల రక్షణకు మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టు కుటుంబసభ్యులకు వైద్యసేవలు అందించడంతో పాటు పిల్లలకు విద్యను ఉచితంగా అందించాలని కోరారు. మన్యం జిల్లా కన్వీనర్ డి.రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు ఇస్తామని చెబుతూ తరువాత విస్మరిస్తున్నారన్నారు. సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ఆర్ పట్నాయక్, విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరరావు, మదన్, జిల్లా కార్యదర్శి కేవీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


