పగలు ఎండ.. రాత్రి చలి
● పదిరోజుల నుంచి ఇదే పరిస్థితి
● వాతావరణంలో మార్పులు
సీతంపేట: ఈ ఏడాది వేసవికి ముందే సూరీడు సుర్రుమంటున్నాడు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో పగలు తీవ్రమైన ఎండ, రాత్రి, వేకువజామున తీవ్రమైన చలి ఏర్పడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. గత నెలాఖరు నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంకా వేసవికాలం పూర్తిగా రాలేదు. అయినా ఎండల తీవ్రత పెరుగుతోంది. పగటి పూట 32 నుంచి 34 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతేడాదిలో మార్చి మొదటి వారం నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండుతుండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రాత్రి చలి..
మరోవైపు రాత్రి పూట చలితీవ్రత వేధిస్తోంది. గాలిలో తేమశాతంలో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో పగలు ఎండ, రాత్రిపూట చలికి జనం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో 10 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పగటిపూట గాలిలో తేమశాతం 56 నుంచి 60 శాతం మధ్య నమోదవుతోందని రాత్రిపూట గాలిలో గరిష్టంగా 90శాతం వరకు నమోదవుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీంతో రాత్రి చలి తీవ్రత పెరిగి వృద్ధులు, పిల్లలు ఇతర దీర్ఘకాల ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారు.
వాతావరణంలో జరుగుతున్న మార్పులతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా పగటి పూట ఎండలు అధికంగా ఉంటున్నాయి. ఎండలో ఎక్కువగా తిరగకూడదు. మంచి ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. బీపీ,మధుమేహం వంటి దీర్ఘకాల రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
కె.విజయపార్వతి,
డిప్యూటీ డీఎంహెచ్‌వో, సీతంపేట
పగలు ఎండ.. రాత్రి చలి
పగలు ఎండ.. రాత్రి చలి


