దారి తప్పుతున్న గురువులు
గాడి తప్పుతున్న ఆశ్రమ పాఠశాలలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఇటీవలి పరిణామాలు పైరవీలతో పోస్టింగులు ముడుపులు అందుకుంటున్న ఐటీడీఏ అధికారులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. నైతిక విలువలు బోధించాల్సిన చోట.. పిల్లలను గాలికొదిలేస్తున్నారు. తప్పుడు మార్గంలో వెళ్లేలా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజ న సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో డిప్యుటీ వార్డెన్ పి.చంద్రమోహన్, ఇతర ఉపాధ్యాయులు ఏకంగా హిజ్రాలను తీసుకొచ్చి పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సభలో అశ్లీల నృత్యాలను చేయించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సద్బుద్ధులు నేర్పాల్సిన గురువులే..ఏం చేయిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. విద్యాసంస్థల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు వరుసగా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. బాధ్యత గల ప్రజాప్రతినిధులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం లేదు. చిన్నపాటి ఆరో గ్య సమస్యలను వార్డెన్లు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. పిల్లల మరణాలు సంభవిస్తే.. తమకేమీ సంబంధం లేదని నిరక్షరాస్యులైన తల్లి దండ్రులతో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పూచీపత్రం రాయించుకోవడం గుమ్మలక్ష్మీపురం మండలంలోని విద్యాసంస్థలో ఇటీవల జరిగింది. కొద్దిరోజుల క్రితం కొమరాడ మండలంలోని ఆశ్రమ పాఠశాలలో సెల్‌ఫోన్ విషయంలో విద్యార్థులు గొడవ పడి, కొట్లాటకు దిగారు. భయంతో అర్ధరాత్రి సమయంలో పారిపోయిన ఇద్దరు విద్యార్థులు..అడవిలోనే రాత్రంతా ప్రయాణించి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడి వారు ఏమయ్యారో.. ఎప్పుడు వెళ్లిపోయారో తెలియని పరిస్థితిలో విద్యాలయ సిబ్బంది ఉండడం గమనార్హం. ఇటీవల కురుపాం మండలంలోని ఓ విద్యాలయంలో గిరిజన బాలిక గర్భం దాల్చింది. ఆమెకు ఎనిమిదో నెల వచ్చినంత వరకూ పాఠశాలలో ఏ ఒక్కరికీ అనుమానం రాకపోవడం.. పర్యవేక్షణ లోపాలను ప్రశ్ని స్తోంది. ఓ ఏకలవ్య పాఠశాలలో బయట నుంచి యువకులు వచ్చి, విద్యార్థులను కొట్టడం.. అమ్మాయిలతో గంటల తరబడి ఆవరణలోనే మాట్లాడడం వంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. పిల్లల మధ్య ఘర్షణ లు..బాలికల్లో లోపిస్తున్న క్రమశిక్షణ, గర్భం దాల్చుతున్న ఆడపిల్లలు..ఈ ఘటనలన్నీ ఆశ్రమ, గిరిజన విద్యాసంస్థల పనితీరును ఎత్తిచూపుతున్నాయి.
వార్డెన్‌పై సస్పెన్షన్..ఎన్నాళ్లంటుందో!
నీలకంఠాపురం ఘటనకు సంబంధించి డిప్యుటీ వార్డెన్ చంద్రమోహన్‌పై అధికార యంత్రాంగం సస్పెన్షన్ విధించింది. ఇది ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. గతంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు సైతం..తూతూమంత్రపు విచారణతో తప్పించుకుని, దర్జాగా కోరుకున్న చోట నేడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తనకు స్థానిక ఎమ్మెల్యే బంధువని చంద్రమోహన్ పదేపదే అందరి వద్ద ప్రస్తావించడం ఇక్కడ గమనా ర్హం. పైరవీలతోనే ఆయన చాలాకాలంగా ఇక్కడ నెట్టుకొస్తున్నారు. ఇక్కడ తప్పు ఆయన ఒక్కరిదే కాదు.. జిల్లాలోని గిరిజన విద్యాసంస్థల్లో నిత్యం జరుగుతున్నవే. పాఠశాలల్లో డిప్యుటీ వార్డెన్ల పోస్టులకు.. కోరుకున్న చోట డిప్యుటేషన్లకు ఐటీడీఏ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా యి. ఇందుకోసం అప్పటి వరకు ఆ స్థానంలో పని చేస్తున్న ఉద్యోగులను సైతం బలి చేసేందుకు వెనుకాడడం లేదు. దీనికి ప్రజాప్రతినిధుల సిఫారసు అదనమవుతున్నాయి. పోస్టుల కోసం పైరవీలు చేసుకుని..ఎన్నాళ్లయినా కదలని ఉపాధ్యాయులు, వార్డెన్లు తప్పులకు అలవాటు పడుతున్నారు. నచ్చి నట్లు ప్రవరిస్తూ, వ్యవస్థను గాడి తప్పిస్తున్నారు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ఆశ్రమ, గిరిజన విద్యాసంస్థల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. పాఠశాలలను ముస్తాబు చేస్తున్నాం..విద్యార్థులు ముస్తాబై రావాలి అంటూ చూస్తున్నామే గానీ.. పిల్లలకు ఏం నైతిక విలువలు బోధిస్తున్నాం.. వారి ఆరోగ్యానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం.. పర్యవేక్షణ ఎలా ఉందో పట్టించుకున్న దాఖలాలు జిల్లాలో కొరవడ్డాయి.


