గజగండం
● పది రోజులుగా పొలాల్లోనే తిష్ఠ ● తామరఖండిలో నేలమట్టమైన పంటలు ● కలెక్టరెట్ వద్ద రైతుల ఆవేదన
పార్వతీపురం రూరల్: సీతానగరం మండలం తామరఖండి గ్రామంలో గజరాజుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన పది రోజులుగా ఎనిమిది ఏనుగు ల గుంపు పొలాల్లోనే తిష్ఠ వేయడంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జనవరి 30 రాత్రి మొదలైన ఈ వన్యప్రాణుల విహారం..సాగుదారుల కష్టాన్ని కకావికలం చేస్తోంది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్లముందే కాలరాస్తుంటే, రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
నేలపాలైన శ్రమ..విరిగిపోయిన మోటార్లు
ఏనుగుల దాడిలో పంటలకే కాకుండా వ్యవసాయ యంత్ర సామాగ్రికి కూడా భారీ నష్టం వాటిల్లింది. వాసిగాని ప్రభాకర్ (5 ఎకరాల చెరకు, 3 ఎకరాల పత్తి), నాగేశ్వరరావు (15 ఎకరాల మొక్కజొన్న), గోవిందరావు (4 ఎకరాల మొక్కజొన్న)తో పాటు ఆదినారాయణ, సింహాచలం, పోలినాయుడు, నాగరాజు, అనూరాధ సాగు చేసిన పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కేవలం పంటలే కాకుండా, బోర్ల పైపులు, స్టార్టర్ బాక్సులు, వైర్లను సైతం ఏనుగులు ధ్వంసం చేయడంతో పొలాలు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఏనుగులు ఇంకా పొలాల్లోనే ఉండటంతో మిగిలిన పంట కూడా దక్కుతుందో లేదోన ని రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఏనుగుల ను అడవుల్లోకి తరలించి, తమకు తగిన నష్టపరిహా రం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.


