అద్భుతం చూడాలంటే.. సాహసం చేయాల్సిందే..!
ప్రకృతి రమణీయత నడుమ మహాలొద్ద జలపాతం రాళ్లూరప్పలు దాటుకుని వెళ్లిన కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు సౌకర్యాలు కల్పిస్తే..పర్యాటకులకు గొప్ప అనుభూతి
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు రూరల్:
చుట్టూ పచ్చని, ఎత్తైన కొండలు.. అక్కడక్కడ విసిరేసినట్లు గిరిజనుల ఆవాసాలు..కనుచూపు మేర కుంచె పట్టి, గీసినట్లు ప్రకృతి రమణీయత..కట్టిపడేసే అందాలు.. మధ్యలో ఆకాశ గంగే నేలపైకి దుమికి వస్తుందా అన్నట్లు జలపాత హొయలు.. మాటల్లో వర్ణించలేని అద్భుత దృశ్యాలు కళ్ల ముందే సాక్షాత్కరిస్తాయి. ఇవన్నీ దాటుకుని వెళ్లాలంటే సాహసమే. గమ్యం చేరుకోవాలంటే పెద్ద కష్టమే. బాహుబలి జలపాతంగా అభివర్ణించే సాలూరు నియోజకవర్గం కొదమ పంచాయతీ నంద సమీపంలోని సుమారు వంద అడుగుల మేర మహాలొద్ద జలపాత వీక్షణం పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకూ స్థానికులకే తెలిసిన ఈ జలపాతాన్ని, బాహ్య ప్రపంచానికి పరిచయం చేసి.. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. సాహసాలు చేయాలనుకునే వారికి, ట్రెక్కింగ్‌ను ఇష్టపడే సాహసికులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.
జలపాతాన్ని ప్రారంభించిన మంత్రి, కలెక్టర్
సహజ సిద్ధమైన సౌందర్యాలకు చిరునామా మన్యం ప్రాంతమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జలాపాతాల ఖిల్లా మన్యం జిల్లా అని తెలిపారు. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని ప్రకృతి రమణీయమైన మహాలొద్ద జలపాతాన్ని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డితో కలిసి మంత్రి సంధ్యారాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లొద్ద జలపాతానికి చేరుకునేందుకు వీలుగా 6 కిలోమీటర్ల మేర రహదారిని రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక జలపాతాలు మరుగున పడి ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే గత మూడు నెలల్లో ఏడు జలపాతాలను ప్రారంభించామని వివరించారు.
మహాలొద్ద జలపాతం గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎవరికీ సందేహం లేదు. కాకుంటే..ఇక్కడికి చేరుకోవడమే పెద్ద సవాల్. సాలూ రు నుంచి మావుడి, లొద్ద వరకు ప్రయాణం సాఫీగా సాగినా.. అక్కడినుంచి కొండల అంచు న.. రహదారి సౌకర్యం లేని మార్గంలో జీపులు, ద్విచక్ర వాహనాలపైనే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మహాలొద్ద ప్రవేశ ద్వారం నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు కొండలపైనే కాలి నడకన ప్రయాణించాలి. రూ.6 కోట్ల వ్యయంతో ఆరు కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపడతామని, అతిథి గృహాలు కూడా నిర్మిస్తామని మంత్రి, కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి, త్వరగా పనులు పూర్తి చేయగలిగితేనే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఎటువంటి సౌకర్యాలూ లేకపోవడం వల్ల సందర్శకుల భద్రత కూడా ప్రశ్నార్థకమే. ఇవన్నీ పూర్తి చేయగలిగితే.. రాష్ట్రస్థాయిలోనే ఈ ‘బాహుబలి జలపాతానికి’ మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ ప్రభాకరరెడ్డి, సంయుక్త కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్‌స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా అటవీ శాఖాధికారి ప్రసూన తదితరులు కొంత దూరం వాహనాల్లోనూ, ద్విచక్ర వాహనాలపైనా ప్రయాణం చేశారు. తొలుత కలెక్టర్ స్వయంగా బైక్ నడుపుతూ ద్విచక్ర వాహనాల ర్యాలీగానూ వచ్చారు. అనంతరం సుమారు మూడు కిలోమీటర్లు కాలినడక న, రాళ్లూరప్పల మధ్యే పడుతూ, లేస్తూ, ఆగు తూ ప్రయాణం సాగించారు. జిల్లా అధికారులు సైతం మధ్యలో జారిపడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు కూడా దొర్లిపోయిన ఘటనలు సంభవించాయి. ఇదే మార్గంలో నిత్యం గిరిజనులు రాకపోకలు సాగిస్తుంటారు. రాళ్ల మార్గంలోనే డోలీలు కట్టి తీసుకెళ్తారు. వారి ప్రయాణం ఎంత కష్టమో జిల్లా అధికారులకు సైతం ఈ పర్యటనలో తెలిసొచ్చింది.
అద్భుతం చూడాలంటే.. సాహసం చేయాల్సిందే..!
అద్భుతం చూడాలంటే.. సాహసం చేయాల్సిందే..!


