మార్చి నెలాఖరులోగా ఉపాధి పనులు పూర్తిచేయాలి
● పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ కృష్ణతేజ
పార్వతీపురం: జిల్లాలో ఉపాధిహామీ పథకంలో నిర్వహిస్తున్న రహదారులు, అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలని పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ ఎం.కృష్ణ తేజ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 15వరకు పూర్తయిన అన్ని పనులకు మార్చి 31లోగా బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి బిల్లులను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మార్చి 15 తరువాత సమర్పించే బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధిహామీ, గ్రామీణాభివృద్ధి పనుల కోసం సుమారు రూ.30వేల కోట్లు కేటాయించినట్లు తెలి పారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వహించకూడదని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించి సకాలంలో నివేదికలు అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
15లోగా శతశాతం పన్నులు వసూలు చేయాలి
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఫిబ్రవరి 15వ తేదీలోగా శతశాతం పన్నులు వసూలు కావాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ హాల్‌లో డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పన్నుల వసూలులో డిప్యూటీ ఎంపీడీఓలు బాధ్యత వహించాలని, లేకుంటే అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. చెత్త సేకరణ, స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్చరథం కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీడీఓలకు, శతశాతం పన్నుల వసూలులో లక్ష్యాలను సాధించిన పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ టి.కొండలరావు, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, విజయనగరం జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీఎల్‌డీఓ రమేష్ రామన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


