మీటర్ రీడర్స్‌కు స్మార్ట్ గుబులు..!
● ఉపాధికి గండి పడుతుందని ఆందోళన
● కొద్ది రోజులుగా సమ్మెబాట
● జిల్లాలో ఏడు లక్షలపైగా విద్యుత్ కనెక్షన్లు
మీటర్ రీడర్స్ డిమాండ్స్
విద్యుత్‌సంస్థలోకి విద్యార్హతను బట్టి ఔట్‌సో
ర్సింగ్ ఉద్యోగులుగా తీసుకోవాలి
● ఉద్యోగ భద్రత కల్పించాలి
● ఖాళీ సమయాల్లో పని కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: ఏరు దాటిందాకా ఏటి మల్ల న్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిస్థితి. ఎన్నికల ముందు తమ్ముళ్లూ స్మార్ట్‌మీటర్లు బిగిస్తే బద్దలుగొట్టండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు విద్యుత్ వినియోగదారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నోటితో స్మార్ట్ మీటర్లు బిగించుకోండని చెబుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు విస్తుపోతున్నారు. టీడీపీ నేతల రెండు నాలుకల ధోరణి పట్ల మండిపడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు మీటర్ రీడర్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో బిగించినట్లయితే తమకు ఉద్యోగ భద్రత ఉండదని మీటర్ రీడర్స్ మధనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది స్మార్ట్ మీటర్లు బిగించేశారు. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ఉద్యోగ భద్రత కల్పించాలని గడిచిన ఏడు రోజులుగా మీటర్ రీటర్స్ సమ్మె చేస్తున్నారు.
రీడర్ తీసే రీడింగ్ 3,500 నుంచి 4 వేలు
జిల్లాలో 170 మంది మీటర్ రీడర్స్ ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10 వతేదీ లోగా ఇంటింటికీ వెళ్లి వారు మీటర్ రీడింగ్ తీస్తారు. సర్వీసులు ఎక్కువ ఉన్నచోట 12 వతేదీ వరకు కూడా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మీటర్‌కు రూ.3.25, పట్టణ ప్రాంతాల్లో రూ.3 చొప్పున చెల్లిస్తారు.
91,224 స్మార్ట్ మీటర్ల లక్ష్యం
జిల్లాలో 91,224స్మార్ట్ మీటర్లు బిగించాలని విద్యుత్‌శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 40 వేల స్మార్ట్ మీటర్లు బిగించేశారు.
స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడర్స్‌కు పని ఉండదు
స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల సంబంధిత వినియోగదారుడి సెల్‌కు విద్యుత్ బిల్లు ఎంత అనేది మేసేజ్ వచ్చేస్తుంది. ప్రత్యేకించి రీడింగ్ తీయాల్సిన పని ఉండదు. దీనివల్ల మీటర్ రీడర్స్ అవసరం ఉండదు. దీంతో తమకు ఉద్యోగం ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది. టీడీపీ సర్కార్ తీరు పట్ల మీటర్ రీడర్స్ పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా , అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. నారాలోకేష్ యువగళం పాదయాత్రలో మీటర్ రీడర్స్ కలిసినప్పుడు అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట ఇచ్చారు. అయితే స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని మీటర్ రీడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ రీడర్స్‌కు కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఉద్యోగ భద్రత కూడా లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల డిగ్రీచదివిన వారు సైతం కొందరు మీటర్ రీడర్స్‌గా చేస్తున్నారు. 10, 15 ఏళ్లుగా మీటర్ రీడర్స్‌గా పనిచేస్తున్నారు.
ఆందోళనలో వినియోగదారులు:
ప్రతి నెలా 10 వతేదీ లోగా మీటర్ రీడర్స్ రీడింగ్ తీస్తారు. ఒక్కరోజు ఆలస్యం అయినా వినియోదారులపై భారం పడుతుంది. మరింతజాప్యం జరిగితే మీటర్‌రీడింగ్ మారిపోయి చెల్లించాల్సిన టారిఫ్ భారీగా పెరిగిపోతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గృహ వినియోగదారులకు ఫర్వాలేదుకాని వాణిజ్య వినియోగదారులకు మరింతగా భారం పడే అవకాశం ఉంది.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
కేటగిరి విద్యుత్ కనెక్షన్ల సంఖ్య
కేటగిరి–1 5,99,932
కేటగిరి–2 65,383
కేటగిరి–3 2513
కేటగిరి–4 14,356
కేటగిరి–5 41,007
హెచ్‌టీ –సర్వీస్ 434
మీటర్ రీడింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మీటర్ రీడర్స్ గత నెల 29వతేదీ నుంచి సమ్మె చేస్తున్నారు.మీటర్ రీడింగ్ తీసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. 91 వేల స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకు 40 వేలు బిగించాం.
మువ్వల లక్ష్మణరావు, ఎస్.ఈ, ఏపీఈపీడీసీఎల్


