టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దాష్టీకం
● వడ్డీ కోసం విచక్షణారహితంగా దాడి
● సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు అనిల్ అఘాయిత్వం
● ఆస్పత్రి పాలైన బాధితురాలు సుజాత
పార్వతీపురం రూరల్: అధికార బలంతో పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అనుచరుడు అనిల్ ఒంటరి మహిళపై రెచ్చిపోయాడు. రాయలేని పదాలతో దూషించాడు. విచక్షణారహితంగా దాడిచేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా జుత్తుపట్టుకుని రోడ్డంతా ఈడ్చేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శగురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆయన రౌడీయిజం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో టీడీపీ కార్యకర్త ఆరాచకంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం ఇందిరా కాలనీ (12వ వార్డు)కి చెందిన ఒంటిరి మహిళ సారిక సుజాత కుటుంబ పోషణ కోసం స్థానికంగా చిన్న టిఫిన్ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తోంది. కుమార్తె వివాహం నిమిత్తం అదే కాలనీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే విజయచంద్ర అనుచరుడు పాలకొండ అనిల్ వద్ద మూడేళ్ల కిందట రూ.50 వేలు అప్పు తీసుకుంది. తన తల్లికి వచ్చే పింఛన్ డబ్బులను తాకట్టుగా పెట్టి నెలకు రూ.3వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తోంది. గత నెల వడ్డీ ఇవ్వలేదు. గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అనిల్ బాధితురాలు సుజాత ఇంటికి వెళ్లి వడ్డీ డబ్బులు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని, ఫిబ్రవరిలో రెండు నెలల వడ్డీ చెల్లిస్తానని సుజాత బతిమిలాడింది. వినిపించుకోకుండా ఆమైపె కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ గుండైపె, ఎడమ చెంపపై పిడిగుద్దులు కురిపించి రాక్షసంగా ప్రవర్తించాడు. స్థానికులు అనీల్‌ను అడ్డుకుని గాయపడిన సుజాతను ఆటోలో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ‘నాకు దిక్కు ఎవరూ లేరని తెలిసి, ఎమ్మెల్యే మనిషినన్న అహంకారంతో నన్ను చావబాదాడు‘అంటూ సుజాత పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది.
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దాష్టీకం
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దాష్టీకం


