రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి పిలుపునిచ్చారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరగనున్న అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు కోచింగ్ క్యాంప్‌ను ఆమె కళాశాల ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబడ్డీ, ఖోఖో క్రీడల్లో విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఉందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని సూచించారు. కళాశాలలో శిక్షణ పొందుతున్న జట్టుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో పితామహుడు పి.చిన్నంనాయుడు, కళాశాల పీడీ ప్రసాద్, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కె.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


