వైద్యవిద్యపై ప్రైవేట్ నీడ వద్దు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలోకి నెట్టడం పేద విద్యార్థుల పాలిట శరాఘాతమని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.మన్మథరావు, ఏఐటీయూసీ నేత ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు జీవో 590 తీసుకురావడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పీపీపీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు వైద్యం భారమవుతుందని అసంతృప్తి వెలిబచ్చారు. విద్యాశాఖ మంత్రి తన ’యువగళం’ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి బి. రవికుమార్, పలువురు విద్యార్థులు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: స్థానిక ఐటీడీఏ పరిధిలోని వివిధ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న 32 మంది పీడీ, పీఈటీలకు మోమోలు జారీ చేసినట్లు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర గురువారం తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్ కొద్ది రోజులుగా లేకపోవడంతో మోమోలు జారీచేసినట్లు స్పష్టం చేశారు.


