వెబ్‌ల్యాండ్ ప్రాతిపదికన రీసర్వే చేయాలి
పార్వతీపురం: వెబ్‌ల్యాండ్ ప్రాతిపదికన భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో రెండవ విడత రీసర్వేపై గ్రామ సర్వేయర్లు, వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత రికార్డులు, కొత్త డిజిటల్ మ్యాపింగ్ వివరాలను సరి పోల్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రీసర్వే చేపట్టాలని సూచించారు. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించి రీసర్వేపై నమ్మకం కలిగించాలని చెప్పారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి మండలంలో రోజువారీ పురోగతి నివేదికలను పంపించాలని కోరారు. ప్రతి గ్రామంలో అసైన్‌మెంట్ రిజిస్టర్‌ను మెయింటైన్ చేయాలని చెప్పారు. ఒరిజినల్ పట్టాదారు కానప్పుడు వారికి పీఓటీ యాక్ట్ ప్రకారం నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి జిరాయితీగా మార్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెటిల్ చేసిన ఈనామ్ భూములకు ఈనామ్ రైత్వారీ పట్టా అని క్లాసిఫికేషన్ పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి పి.లక్ష్మణరావు, పార్వతీపురం, పాలకొండ డీఐఓఎస్‌లు, రీసర్వే తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.
జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి


