రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా! | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా!

Dec 18 2025 7:35 AM | Updated on Dec 18 2025 7:35 AM

రెవెన

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా!

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా! ● జిల్లాలో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌..

కోకొల్లలుగా దరఖాస్తులు అన్నీ పరిష్కరించేస్తున్నామని చెబుతున్న అధికారులు మళ్లీమళ్లీ వస్తున్న అర్జీదారులు

ఈయన పేరు గుణుపూరు పారినాయుడు, సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామం. ఆయనకు సర్వే నంబర్‌ 160–1లో 52.50 సెంట్ల భూమి ఉంది. రీసర్వే సమయంలో 50 సెంట్లు పడితే అదే భూమి కొలిచారు. తన భూమిని అదే సర్వే నంబరులో ఇంకొకరి పేరులో ఉంది. వారికి 91.50 సెంట్లు ఉంటే.. దానిని 98 సెంట్లుగా ఆన్‌లైన్‌ చేశారు. సర్వే నంబరు 160–3లో పాస్‌ పుస్తకం ప్రకారం 29 సెంట్లు ఉంటే.. ఆన్‌లైన్‌లో 27 సెంట్లుగా చూపించారు. తర్వాత 27 సెంట్లను కాస్త 23 సెంట్లుగా మార్చి చూపారు. రీసర్వే జరిపి, తప్పులను సరి చేయాలని.. అందుకయ్యే మొత్తం భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మొర పెట్టుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది.

బలిజిపేటకు చెందిన చోడవరపు సూర్యనారాయణ పేరు మీద ఉన్న 48 సెంట్ల భూమిని.. తన కుమార్తె కెల్ల లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కొద్దిరోజుల కిందట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. తీరా, అందులో 40 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్లు చూపించడంతో సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే మూడు దఫాలు కలెక్టరేట్‌కు వచ్చానంటూ ఆయన వాపోయారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో రెవెన్యూపరమైన సమస్యలు కోకొల్ల లు. ప్రతి వారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతుల్లో రెవెన్యూ సంబంధితమైనవే అధికం. దాదాపు సగానికిపైగా భూ సంబంధిత సమస్యలే. చాలా వరకు వివాదాల్లో ఉన్నవే. వీటిని పరిష్కరించడానికి సమ యం పట్టవచ్చు. ఇదే విషయం అర్జీదారులకు అర్థ మయ్యేలా, సంతృప్తికర స్థాయిలో చెప్పడం అధికారుల బాధ్యత. రెవెన్యూ శాఖలో అది జరగడం లే దు. అధికారులకు, సిబ్బందికి డబ్బులిచ్చినా, ప్రజాప్రతినిధుల సిఫారసులున్నా.. ఎలాంటి పనైనా ఇట్టే పూర్తి చేస్తారన్న ఆరోపణలు ఈ శాఖ మీద ఉన్నా యి. అదే సామాన్యులు ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండదు. ఈ కారణం వల్లే ఎక్కువగా ఏసీబీ వలలో పడే అధికారుల్లో రెవెన్యూవారే ఉంటున్నారు.

రెవెన్యూ సమస్యలకు చెక్‌ పెట్టేలా.. సంయుక్త కలెక్టర్‌ నాయకత్వంలో జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌కు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్‌లోనే ప్రతి సోమవారం ఒకవైపు పీజీఆర్‌ఎస్‌ జరగగా.. మరోచోట రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. దీనిని సెప్టెంబర్‌ 29న ప్రారంభించారు. ఇప్పటి వరకు 10 ‘క్లినిక్‌’లు చేపట్టారు. ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి, వీలైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. దీర్ఘకాలిక సమస్యలున్నప్పుడు వాటిని ప్రాథమికంగా విచారణ చేయడానికి మండలాల తహసీల్దార్లు, ఇద్దరు సబ్‌ కలెక్టర్లు, జేసీని ఉంచి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్లినిక్‌కు మొదటి ఆరు వారాల్లో 227 ఫిర్యాదులు అందగా.. అవన్నీ పరిష్కరించేశామని ప్రకటించుకోవడం గమనార్హం. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రయత్నిస్తే.. 173 మంది ఫోన్‌ తీసి, తమ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విజ్ఞప్తులు ఇచ్చిన వారే మరలామరలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతివారం పెరుగుతున్న వినతుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులే. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ పట్ల వారికి ఉన్న అవగాహన కూడా తక్కువే. అటువంటి వారి నుంచి అభిప్రాయాలు సేకరించి, వంద శాతం పూర్తి చేసేశామని అధికారులు చెప్పుకోవడంపై ప్రజాసంఘాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి ఆన్‌లైన్‌ సమస్యలకే మోక్షం చూపడం లేదని, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే.. ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంటుందని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

చిత్రంలోని వ్యక్తి పేరు చింతా సత్యనారా యణ. పెద్దగైశీల గ్రామం. తల్లి పేరిట ఉన్న డీ పట్టా భూమిని తన పేరున మార్చాలని కోరుతూ.. ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన ‘రెవెన్యూ క్లినిక్‌’కు వచ్చాడు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఆయన రావడం ఇది మూడోసారి. అది అవుతుందా? లేదా?.. అవ్వకపోతే ఎందు కు మారదు? వంటి సహేతుకమైన కారణాన్ని గ్రా మ, మండల స్థాయిలోనే చెప్పి సమస్యను పరిష్కరించవచ్చు. ఆ పనిని రెవెన్యూ యంత్రాంగం సక్రమంగా చేయలేకపోవడంతో కొన్నాళ్లుగా ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా! 1
1/3

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా!

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా! 2
2/3

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా!

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా! 3
3/3

రెవెన్యూ వేదన.. క్లినిక్‌లో చికిత్స అందేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement