కుంకీలొచ్చేనా? కరి కలత తీర్చేనా..?
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఒడిశా నుంచి అటవీ ప్రాంతం మీదుగా మన్యం భూభాగంలోకి వచ్చిన గజరాజులు.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడే తిష్ట వేశాయి. జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు నాగావళి, వంశధార తీర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, భామిని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 12 ఏనుగులు తిరుగుతున్నాయి. వీటివల్ల అటు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లడమే కాక.. సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద నిద్ర కరవవుతోంది. వీటిని దారిలోకి తెచ్చేందుకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని ఏళ్లుగా చెబుతున్న మాట నేటికీ కార్యరూపం దాల్చలేదు. వచ్చే సంక్రాంతినాటికి జిల్లాకు కుంకీలొస్తాయని ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల డీఆర్‌సీలో చెప్పారు. ఆ మాట.. ఈసారైనా అమలవుతుందో లేదో చూడాలి.
తరలింపా.. ఇక్కడే ఉంచుతారా?
ఎలిఫెంట్ జోన్, కుంకీలు.. తరలింపు ఇలా రకరకాల ఆలోచనల్లో అధికార యంత్రాంగం ఉంది. అందుకు కొన్ని ప్రాంతాలనూ గుర్తించారు. ఏదీ ముందుకు సాగడం లేదు. పునరావాస కేంద్రం కోసం స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు జోన్ అయితే రూ.30 కోట్ల వరకు అవసరం అవుతుంది. పెద్దమొత్తంలో ఆహారం తీసుకునే ఏనుగులకు.. ఇక్కడ ఉంచిన తర్వాత ఆ స్థాయిలో ఆహారం కల్పించడమూ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక కేంద్రంవైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కుంకీలొచ్చాక వాటి ద్వారా జిల్లాలోని ఏనుగులను కొన్నాళ్లు గుచ్చిమి కేంద్రం వద్ద ఉంచి.. అనంతరం శేషాచలం అడవులకు తరలించే యోచన చేస్తున్నారు. లేకుంటే ఒడిశా ప్రభుత్వం, అధికారులను సమన్వయం చేసుకుని అక్కడి లఖేరి ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నారు. కుంకీలు రాగానే.. భామిని వైపు ఉన్న గుంపును తొలుత కేంద్రానికి తరలించాలని చూస్తున్నారు.
త్వరలోనే కుంకీలొచ్చే అవకాశం ఉంది. అవి రాగానే.. జిల్లాలో ఉన్న గుంపును గుచ్చిమి వద్ద నిర్మిస్తున్న టెంపరరీ ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాకు తరలిస్తాం. కేంద్రం నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఏనుగుల కదలికలను నిత్యం గమనిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. – జీఏపీ ప్రసూన,
జిల్లా అటవీశాఖాధికారిణి
పసుకుడి చేరిన ఏనుగులు
భామిని: మండలంలోని పసుకుడి గ్రామ సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు మంగళవారం చేరింది. వంశధార నది ఆవల ఒడిశా గ్రామాల నుంచి ఏనుగులు తరలివచ్చాయి. పంటపొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పంటలకు నష్టం చేకూర్చుతున్నాయంటూ గగ్గోలుపెడుతున్నారు.
కుంకీలొచ్చేనా? కరి కలత తీర్చేనా..?
కుంకీలొచ్చేనా? కరి కలత తీర్చేనా..?
కుంకీలొచ్చేనా? కరి కలత తీర్చేనా..?


