ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?

Dec 17 2025 6:49 AM | Updated on Dec 17 2025 6:49 AM

ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?

ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?

మెడికల్‌ కాలేజీలపై మీ ప్రాధాన్యత ఏమిటి?

ప్రైవేటుకు అప్పగిస్తే ఉచిత వైద్యం

అందుతుందా?

పేదవాడి వైద్యానికి శంషాబాద్‌ ఎయిర్‌

పోర్ట్‌తో పోలికా

మంత్రి శ్రీనివాస్‌ వ్యాఖ్యలను

ఖండించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా

అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించలేరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పాలని విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అవలంభించే విధానాన్ని తెలియజేయాలని కోరారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం తలపెట్టిన ప్రజాఉద్యమ ర్యాలీకి అపూర్వ స్పందన లభించిందన్నారు. జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి వైద్యానికి, శంషాదాబాద్‌ విమానాశ్రయానికి పోలికచేస్తూ మంత్రి చేసిన వాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి తన నేపథ్యాన్ని, స్థానిక పరిస్థితులను పదవీ వ్యామోహంలో విస్మరించడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరోపణలు చేస్తున్న మంత్రి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలు ఇష్టపూర్వకంగా ఎందుకు సంతకాలు చేశారో తెలుసుకోవాలని హితవుపలికారు. అవసరమైతే వారి వివరాలు తామే ఇస్తామని చెప్పారు.

● పీపీపీ విధానంలో ప్రభుత్వమే కళాశాలలను నిర్మించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించిన తరువాత ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని జెడ్పీ చైర్మన్‌ ప్రశ్నించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇంకెందుకని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న మిమ్స్‌ మెడికల్‌ కాలేజీతో పాటు, పక్కనే విశాఖ జిల్లాలోని గీతం మెడికల్‌ కాలేజీలో రోగులకు ఉచితంగా సేవలందించగలరా అని ప్రశ్నించారు. అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరిస్తే పేదలు డబ్బులిచ్చి వైద్యం చేయించుకోగలరా అని నిలదీశారు. దశాబ్దాల కిందట విశాఖలో నిర్మించిన కేజీహెచ్‌లో ఎంత మంది ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారో మంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వానికి సత్తా లేకే ఇటువంటి వాఖ్యలు చేస్తు న్నారని దుమ్మెత్తి పోశారు.

● రాష్ట్రప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. వైఎస్సార్‌ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఉన్నత చదువులు అభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, వైద్యకళాశాలలో ఆరోగ్య భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అందించే సేవల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని మంత్రికి హితవుపలికారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

జీతాల చెల్లింపులో తప్పుడు ప్రకటనలా...?

అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ చెల్లించాల్సిన జీతాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విషయం బాధ్యత గల మంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నవంబర్‌ నెలలో పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ సహా 7 శాఖలకు చెందిన ఉద్యోగులకు 7 నుంచి 10వ తేదీల మధ్య జీతాలు చెల్లించారన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు మాత్రమే జీతాలు సక్రమంగా వేశారని, అనంతరం కాలంలో ఎప్పుడు వేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఉన్న సమన్వయం తేటతెల్లమవుతుందన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యంలో పారదర్శకత పాటిస్తున్నమంటూ మంత్రి కొండపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్వింటా దగ్గర 10 కేజీలు ధాన్యం రైతుల వద్ద నుంచి మిల్లర్లు దోపిడీ చేయడమేనా మీ పారదర్శకత అంటూ ఎద్దేవాచేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెందిన అనుకూల పత్రికలో ప్రత్యేక కథనం ఇచ్చారని, ఆ కథనాన్ని ఖండించి మాట్లాడాలని సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement