‘పది’ంతల ఉత్సాహంతో.. పరీక్షలకు సన్నద్ధం
వీరఘట్టం: పదోతరగతి పరీక్షలకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులను ఉపాధ్యాయులు సంసిద్ధం చేస్తున్నారు. పాఠశాలల్లో వంద రోజుల విద్యాప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. వరుసగా మూడేళ్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మన్యం జిల్లా ముందంజలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధనకు విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. జిల్లాలోని 187 సర్కారు బడుల్లో ఈ ఏడాది 10,856 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో చదువులో వెనుకబడిన వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సులభ పద్ధతుల్లో బోధిస్తున్నారు. ఉత్తీర్ణత మార్కు లు సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. చదువులో ప్రతిభ చూపినవారికి అధిక మార్కులు సాధించేలా బోధన సాగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మార్చి 13వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవడం, రాయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
గత మూడేళ్లలో సాధించిన టెన్త్ ఫలితాలు పునరావృతం చేసేందుకు విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధంచేశాం. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఆదివారం కూడా సబ్జెక్టు టీచర్లతో ప్రత్యేక తరగతులు చెప్పిస్తున్నాం. – పి.బ్రహ్మాజీరావు, డీఈఓ,
పార్వతీపురం మన్యం జిల్లా
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. శతశాతం ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేశారు. ఇంగ్లిష్, గణితం, సైన్సు సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్టులపై విశ్లేషణాత్మకంగా తరగతులు నిర్వహిస్తున్నాం. – సీహెచ్ రత్నాకరరావు,
హెచ్‌ఎం, బిటివాడ హైస్కూల్,
వీరఘట్టం మండలం
పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక
ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ సాధించేలా కార్యాచరణ
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పరీక్షలు రాయనున్న విద్యార్థులు 10,869 మంది
‘పది’ంతల ఉత్సాహంతో.. పరీక్షలకు సన్నద్ధం
‘పది’ంతల ఉత్సాహంతో.. పరీక్షలకు సన్నద్ధం


