ఆటోలకు సీరియల్ నంబర్లు కేటాయిస్తాం
విజయనగరం క్రైమ్: నగరంలో తిరుగాడుతున్న ఆటోలకు త్వరలో సీరియల్ నంబర్లు జారీ చేస్తామని విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు తెలిపారు. ఇదే విషయమై ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆటో యూనియన్ నాయకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఆటోల క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా సీరియల్ నంబర్లు కేటాయించనున్నామన్నారు. ఆటోడ్రైవర్ల భద్రతా ప్రమాణాలు కాపాడడంతో పాటు ఆటోల్లో ప్రయాణించే వారి రక్షణకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఆటోల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను కొనుగొనేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. సీరియన్ నంబర్ చూడగానే ఇది ఎవరి ఆటో, ఏ ఆటోస్టాండ్, యూనియన్‌కు చెందినది..ఇలా అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో ట్రాఫిక్ ఎస్‌ఐ ఎస్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆటోస్టాండ్‌లు మంజూరు చేయండి..
విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని చాలామంది ఆటోవాలాలకు సంబంధించిన ఆటోలను నిలుపుదల చేసేందుకు ఆటోస్టాండ్‌లు లేవని తక్షణమే ఆటోస్టాండ్‌లు మంజూరు చేయాలని ఆటో యూనియన్ నాయకులు కనకారావు, అప్పలరాజు కోరారు. ఆటోస్టాండ్‌లు లేని కారణంగా ఆటోడ్రైవర్లు రన్నింగ్ ఆటోవాలాలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.


