సూర్యప్రకాష్‌కు ఇన్‌స్పైరింగ్ ఇండియన్స్ అవార్డు
గరుగుబిల్లి: ప్రముఖ కార్డియాలజిస్టు డా. గుల్ల సూర్యప్రకాష్‌కు ఇన్‌స్పైరింగ్ ఇండియన్స్ అవార్డును ఢిల్లీలో ఇన్‌స్పైర్ మనక్ సంస్థ ప్రధానం చేసింది. ఈయన గ్రామీణ నేపథ్యం నుంచి వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి చేరి వైద్య రంగంతో పాటు ప్రజల మన్ననలను కూడా అందుకుంటున్నారు. వైద్యాన్ని లాభసాటిగా కాకుండా పేదలకు సేవలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. నగరాలకే పరిమితమైన కార్డియాక్ట్ పరీక్షలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఉచిత వైద్య శిబిరాలను, స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా సామాజిక సేవగా భావించి యువ వైద్యులను, వాలంటీర్లను సేవా మార్గంలో నడిపించేలా వైద్యం ఒక మిషన్ అనే భావనను కల్పించారు. ఈయన వైద్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ఢిల్లీలో ఇన్‌స్పైర్ మనక్ సంస్థ ఇన్‌స్పైరింగ్ అవార్డును ప్రధానం చేసి ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సూర్యప్రకాష్ మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయనను సర్పంచ్ బి.మహేశ్వరరావుతో పాటు పలువురు అభినందించారు.


