ఆటలతో ఉల్లాసం.. బోధనలో వికాసం
● ఉత్సాహంగా టీచర్ల క్రికెట్ పోటీలు
● ప్రారంభించిన డీఈవో బ్రహ్మాజీరావు
పార్వతీపురం రూరల్: క్రీడలతోనే ఉపాధ్యాయులకు మానసిక వికాసం, శారీరక దృఢత్వం లభిస్తాయని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురం జడ్పీ హైస్కూల్ మైదానంలో శనివారం డివిజన్‌్ స్థాయి టీచర్ల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు అందించే చురుకుదనం వల్ల తరగతి గదిలో ఉపాధ్యాయులు మరింత సమర్థంగా బోధించగలుగుతారన్నారు. క్రీడల నిర్వహణ పట్ల ఎంఈవో–1 సింహాచలం హర్షం వ్యక్తం చేశారు. కొమరాడ ఎంఈవో నారాయణస్వామి పర్యవేక్షణలో, ఎస్జీఎఫ్ బాధ్యులు సబ్బాన మురళి, మండంగి మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో బలిజిపేట, సాలూరు, పార్వతీపురం తదితర మండలాల జట్లు తలపడ్డాయి. బొత్స రవికుమార్ తనదైన వ్యాఖ్యానంతో అలరించగా హెచ్‌ఎం సత్యనారాయణ, పీడీలు పాల్గొన్నారు.


