ఆరోగ్యానికి అభాయం
పార్వతీపురం రూరల్:
పాత డాక్టర్ చీటీలు ఎక్కడ పెట్టామో తెలియక ఇల్లంతా వెతుకులాట..అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్తే పాత రిపోర్టులు దొరక్క మళ్లీ కొత్తగా టెస్టులు. ఈ తిప్పలు పడని మధ్యతరగతి కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇక ఆ బాధలకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’’ (అభా)కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన డిజిటల్ అస్త్రం. దీని గురించి చాలా మందికి తెలిసినా, ఇందులో ఉన్న అసలు కిటుకు తెలియక అయోమయంలో ఉన్నారు. అభా అంటే బీమాకా ర్డా? లేక ఆరోగ్య రికార్డా, దీన్ని అసలు ఎలా వాడా లి అనే సందేహాలకు సమాధానమే ఈ కథనం.
అసలు ఏమిటీ ఈ ఆభా..?
సింపుల్‌గా చెప్పాలంటే..ఇది మన ఆరోగ్య జాతకం. బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్నట్లు ఈ ఆభా ఖాతాలో మన ఆరోగ్య సమాచారం (హెల్త్ రికార్డ్స్) మొత్తం భద్రంగా ఉంటుంది. ఇది 14 అంకెలు ఉండే ఒక యూనిక్ ఐడీ కార్డు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మెడికల్ హిస్టరీని(పాత జబ్బులు, మందుల చీటీలు, టెస్టు రిపోర్డులు) కాగితాల కట్టలుగా మోసుకెళ్లాల్సిన పనిలేకుండా డిజిటల్ రూపంలో డాక్టర్లకు చూపించడమే దీని ప్రధాన లక్ష్యం. చాలా మంది ఈ ఆభాకార్డును ఆయుష్మాన్ భారత్ కార్డు రూ.5లక్షల బీమాతో కలిపి తికమక పడుతున్నారు. ఇది డిజిటల్ రికార్డుల కోసం మాత్రమే. ఇది బీమాకార్డు కాదు. దీన్ని ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పొందవచ్చు.
కుటుంబానికి అభా ఎందుకు అవసరం..?
ఒక ఇంటి యజమానిగా కుటుంబ ఆరోగ్య భద్రతకు ఆభా ఎలా ఉపయోగపడుతుందంటే పిల్లలు పుట్టినప్పుడు వేసిన టీకాల నుంచి చిన్నప్పుడు వచ్చిన జబ్బుల వరకు అన్నీ ఈ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. భవిష్యత్‌లో వారికి ఏదైనా సమస్య వస్తే పాత రికార్డులన్నీ ఒక్క క్లిక్‌తో వైద్యులు చూడగలుగుతారు. దీనివల్ల సరైన వైద్యం అందుతుంది. అలాగే వృద్ధులకు, వయస్సు మళ్లిన వారికి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఊరు మారాం కదా అని డాక్టర్‌ను మారిస్తే మళ్లీ మొదటి నుంచి టెస్టులు చేయించే ఖర్చు, శ్రమ తప్పుతుంది. అలాగే ఎమర్జెన్సీలో పేషెంట్ అపస్మారక స్థితిలో ఉంటే ఈ అభా నంబర్ ద్వారా డాక్టర్లు వెంటనే వారి బ్లడ్ గ్రూపు, అలర్జీలు, వాడుతున్నమందులు తీసుకుని వెంటనే చికిత్సను మొదలు పెట్టవచ్చు.
నమోదుకు కావాల్సిన పత్రాలు
ఆధార్ కచ్చితంగా మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి. ఆధార్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ ఆధార్‌తో సులభంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆధార్ లింక్‌తో వచ్చిన ఓటీపీని కచ్చితంగా ఇచ్చి నమోదు చేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని 5 నిమిషాల్లో(ఏబీహెచ్‌ఏ.ఏబీడీఎం.జీఓవీ.ఇన్)వెబ్‌సైట్ ద్వారా లేదా ఆభా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ ఎంపికను చేసి యూజింగ్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్‌కు జతచేసి ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే పేరు, ఆధార్‌లో ఉన్న ముఖ చిత్రం కనిపిస్తాయి. ఒక వేళ రానట్‌లైతే పొందుపరచాలి. ఈ మేరకు ఈమెయిల్ ఐడీ మాదిరిగా క్రియేట్ చేసుకోవాలి. వెంటనే మీ అభా కార్డు జనరేట్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని జాగ్రత్త చేసుకోవాలి.
ఆస్పత్రిలో ఎలా వాడాలి
ఆస్పత్రికి వెళ్లినప్పుడు రిసెఫ్షన్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీ ఫోన్‌లో అభా యాప్ ద్వారా దాన్ని స్కాన్‌చేసి ప్రొఫైల్‌ను షేర్‌చేయాలి. ఇలా చేయడం వల్ల గంటల తరబడి లైన్‌లో నిలబడి ఓపీ చీటీకోసం వేచి ఉండాల్సిన పనిలేదు. మీ వివరాలు నేరుగా రిసెప్షన్ సిబ్బంది కంప్యూటర్‌లోకి వెళ్తాయి. వెంటనే ఓపీ స్లిప్ వచ్చేస్తుంది. డాక్టర్ రాసిన మందులు, చేసిన టెస్ట్ రిపోర్టులన్నీ ఆటోమెటిక్‌గా ఆభా యాప్‌లోకి వచ్చేస్తాయి. ఇక ఆ కాగితాలు పోతాయన్న భయం లేదు.
ఫైళ్ల బరువు మోసే తిప్పలకు చెల్లిన కాలం
దేశమంతా చెల్లుబాటయ్యేలా డిజిటల్ హెల్త్ రికార్డులు
14 అంకెలతోనే సంపూర్ణ ఆరోగ్య చరిత్ర
జిల్లాలో ఇప్పటికే 8,41,503 రిజిస్ట్రేషన్లు
చేతిలో ఫోన్ ఉంటే..నిమిషాల్లో నమోదు


