వైకల్యాన్ని అధిగమించి... ఆటలో రాణించి..
శ్రీలంకలో చాంపియన్స్ ట్రోఫీతో శివదుర్గాప్రసాద్
పాలకొండ రూరల్:
వైకల్యాన్ని అధిగమించి.. ఆటలో రాణించి.. అంతర్జాతీయ వేదికపై ఔరా అనిపించాడు.. పాలకొండ పట్టణానికి చెందిన యువకుడు శివదుర్గాప్రసాద్ బెహరా. ఈ నెల 6, 7 తేదీల్లో శ్రీలంకలో జరిగిన తొలి సౌత్ ఏషియన్ పారా చాంపియన్‌షిప్ త్రోబాల్ గేమ్స్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి గురువారం పాలకొండ చేరుకున్న శివదుర్గాప్రసాద్‌కు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. ఘన సన్మానం చేశారు.
పాలకొండ లోగిడి వీధికి చెందిన సన్యాసిరావు, పార్వతి దంపతుల ఏకై క కుమారుడు శివదుర్గాప్రసాద్. అతడికి చిన్నతనం నుంచి ఎడమచేయి పనిచేయదు. కుమారుడు చదువుతో పాటు క్రీడల్లో చూపుతున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. పెద్దకాపువీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆర్.రాములు, పుష్పనాథం తర్ఫీదుతో త్రోబాల్, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. ఎడమ చేయి పూర్తిగా సహకరించకున్నా చిన్నతనం నుంచి కఠోర శ్రమ, కృషితో క్రీడల్లో ముందడుగు వేశాడు. పదో తరగతి అనంతరం రాజాం ఐటీసీలో ఫిట్టర్ కోర్సు చదువుతూ క్రీడల్లో తలపడి పతకాల పంట పండిస్తున్నాడు.
తొలుత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో తలపడిన శివదుర్గాప్రసాద్ ఆల్ రౌండర్‌గా పేరు సంపాదించాడు. ఇదే స్ఫూర్తితో విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో తలపడి జిల్లా జట్టును తృతీయ స్థానంలో నిలిపాడు. నాలుగేళ్ల కిందట భువనేశ్వర్‌లో జరిగిన అథ్లెటిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 2024లో చైన్నెలో జరిగిన జాతీయ స్థాయి పారా కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టును ద్వితీయ స్థానంలో నిలపడంలో కీలక భూమికి పోషించాడు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారా క్రికెట్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ప్రథమ స్థానంలో నిలిపాడు.
దేశం తరఫున సత్తా చాటిన శివదుర్గా ప్రసాద్‌కు పాలకొండలో అపూర్వ స్వాగతం లభించింది. తన స్నేహితులు, క్రీడాభిమానులు, తల్లితండ్రులు, కుటంబ సభ్యులు ఆయనకు అభినందలు తెలిపారు. కేక్ కట్‌చేసి సందడి చేశారు. తన ఇంటి వద్ద పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా శివదుర్గాప్రసాద్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే ప్రత్యేక తర్ఫీదు కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తే మరిన్ని పతకాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తంచేశారు.
వైకల్యాన్ని అధిగమించి... ఆటలో రాణించి..


