ధాన్యం కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయమేంటి?
వీరఘట్టం: ధాన్యం కొనుగోలు చేసే ప్రతిచోట మధ్యవర్తులు చొరబడుతున్నారు.. ప్రతి బస్తాకు 5 నుంచి 8 కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు చేయలేమా..? అసలు ధాన్యం కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయమెందుకు? అంటూ జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. వీరఘట్టం మండలం నడుకూరు రైతు సేవా కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ట్రక్‌షీట్ ఎలా జనరేట్ చేస్తున్నారని టెక్నికల్ అసిస్టెంట్‌ను అడగగా అతని వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ట్రక్‌షీట్ జనరేట్ చేయడం రానివారిని టెక్నికల్ అసిస్టెంట్స్‌గా ఎలా నియమించారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని టెక్నికల్ అసిస్టెంట్స్‌కు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై శిక్షణ ఇవ్వాలని తహసీల్దార్ ఎ.ఎస్.కామేశ్వరరావు, ఏఓ సౌజన్యను ఆదేశించా రు. అనంతరం నడిమికెల్ల రైతు సేవా కేంద్రాన్ని జేసీ తనిఖీచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశా రు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటి జిల్లా వ్యాప్తంగా 68,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదు లు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అంతకు మందు నడుకూరు సమీపంలోని ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.


