13న పారా రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్స్‌ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా పారా రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు హాజరు కానున్నారని, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న పారా పవర్ లిఫ్టర్ లు ఈ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 9849377577 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్, కోచ్ తదితరులు పాల్గొన్నారు.


