వెనుకబడిన విద్యార్థులపై నిర్లక్ష్యం
పార్వతీపురం రూరల్: ర్యాంకుల రేసులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న అధికారుల తాపత్రయం పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందా? ‘వంద రోజుల ప్రణాళిక’ పేరుతో విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యాచరణ విద్యార్థులను తీర్చిదిద్దడం పక్కన పెడితే..వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టివేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అందరికీ ఒకే మందు’ అన్న చందంగా.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించిన ఈ షెడ్యూల్ వల్ల విద్యార్థులు లాభం కంటే నష్టమే ఎక్కువ పొందే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ లోకం హెచ్చరిస్తోంది.
బోధన కన్నా..‘యాప్’ల గోలే మిన్న
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం మంచిదే అయినా.. ఆచరణలో ఉపాధ్యాయులపై పడుతున్న పని భారం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. రోజూ ఉదయం జిల్లా కార్యాలయం నుంచి వచ్చే వాట్సాప్ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించడం, పరీక్ష పెట్టడం, ఆ వెంటనే మార్కులను సాయంత్రం లోపు ‘లీప్ యాప్’లో అప్‌లోడ్ చేయడం..ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. బోధన కంటే ఈ సాంకేతిక పనులకే ఉపాధ్యాయుల సమయం హరించుకుపోతోంది. పిల్లలకు పాఠం చెప్పాలా? లేక యాప్ లో మార్కులు ఎక్కించాలా? అన్న సందిగ్ధంలో టీచర్లు కొట్టుమిట్టాడుతున్నారు.
విరామం ఎరుగని ‘యంత్రాలు’
పిల్లలంటే యంత్రాలు కాదు..రక్తమాంసాలున్న మనుషులు. కానీ విద్యాశాఖ మాత్రం రెండవ శనివారాలు, ఆదివారాలు కూడా క్లాసులు పెట్టి వారిని రోబోల్లా మార్చేస్తోంది. ఇప్పటికే సిలబస్ పూర్తయిన తరుణంలో.. విద్యార్థులకు స్వయంగా చదువుకునేందుకు, పునశ్చరణ చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. కానీ, సెలవు రోజుల్లో కూడా బడికి రప్పించడం వల్ల విద్యార్థులు తీవ్ర అలసటకు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరికితేనే చదివింది వంటబడుతుంది. ఇలా ఊపిరి ఆడనివ్వకుండా చదివిస్తే..అసలుకే ఎసరు వస్తుంది’ అని సీనియర్ ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు.
పది పరీక్షలకు వంద రోజుల ప్రణాళికతో ‘స్లో లెర్నర్స్’ బలి!
అందరికీ ఒకే విధానం..
ఎలా సాధ్యం?
జిల్లాలో 187 ప్రభుత్వ ఉన్నత
పాఠశాలలు
ర్యాంకుల పరుగులో విద్యార్థులకు గండం
వందరోజుల ప్లాన్‌తో ఒత్తిడి


