హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
● వన్‌స్టాప్ సెంటర్ వాహనం ప్రారంభం
విజయనగరం ఫోర్ట్: హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో వన్‌స్టాప్‌సెంటర్ నూతన వాహనాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద వన్‌స్టాప్ సెంటర్ హెల్ప్ లెన్ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనంలో వైద్యం, న్యాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను అందించనున్నారని తెలిపారు. మహిళలను హింసజరిగే ప్రదేశం నుంచి (ఇల్లు, పని స్థలం) ఈకేంద్రాలకు తీసుకురావడం లేదా వారిని అవసరమైన ప్రదేశాలకు తరలించడానికి ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఆపదలో ఉన్న మహిళకు హెల్ప్‌లైన్ వాహనం వన్‌స్టాప్ సెంటర్‌గా ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు హెల్ప్‌లైన్ 181, పోలీస్ 100, ఆస్పత్రి 108 లీగల్ సర్వీసెస్ అనుసంధానం చేసి ఉన్నందున 24 గంటల పాటు సేవలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎంసీ సుజాత, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కీలక ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి
విజయనగరం అర్బన్: జిల్లాలో అమలవుతున్న పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ
మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి ప్రాజెక్టు, తారకరామ తీర్థసాగర్, జాతీయ రహదారి 130సీ, జాతీయ రహదారి 519ఈ, ఖుర్దారోడ్–విజయనగరం మూడోలైన్, కొత్తవలస, విజయనగరం నాలుగోరైల్వే లైన్ తదితర మేజర్ ప్రాజెక్ట్‌ల భూసేకరణ ప్రకటనలు, పరిహార చెల్లింపులు వంటి అంశాలను వివరంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే సేకరించిన ప్రభుత్వ భూమిని వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించాలని మిగతా భూసేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర ఎస్.సేతుమాధవన్, ఆర్‌డీఓలు దాట్ల కీర్తి, రామ్మోహన్, ఎస్‌డీసీ కళావతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, అటవీశాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్‌అండ్‌బీ, రైల్వే శాఖ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు (భూసేకరణ) పాల్గొన్నారు.


