అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు గల క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు, కోడిరామూర్తినాయుడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెయిట్ లిఫ్టర్‌లున్నారన్నారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారుల్లో రాణించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 క్రీడా విభాగాల్లో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈనెల 12, 13 తేదీలలో, ఈనెల 15, 16, 17వ తేదీలలో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అలాగే జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ (జలక్రీడలు) నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. దీనికి సంబంధించి శాప్‌తో చర్చించగా అంగీకారం తెలిపిందన్నారు. 2030లో కామన్‌వెల్త్ గేమ్స్ భారతదేశానికి కేటాయించనున్న తరుణంలో క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి కామన్‌వెల్త్ క్రీడలలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 3శాతం రిజర్వేషన్ ఉందని ఈమేరకు స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు, ప్రవేశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పొల్గొన్నారు.


