బ్రెయిన్ యోగా ఒక అద్భుతం
● అంతర్జాతీయ బ్రెయిన్ యోగా గురువు పిడుగు శ్రీనివాసులు
విజయనగరం: బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగా గురువు, అంతర్జాతీయ శిక్షకుడు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను పెంచడం, ఆందోళనను తగ్గించడం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం, మెదడుకు రక్త ప్రసరణను పెంచడం, న్యూరోన్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగాతో సాధ్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ ముద్రలతో బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులును, రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ దుర్గాబాలాజీ, పాఠశాల ప్రిన్సిపాల్ పూడి శేఖర్‌తో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య, జగదీష్, లత తదితరులు పాల్గొన్నారు.


